ఆదివారం 29 నవంబర్ 2020
National - Oct 29, 2020 , 02:35:28

బీహార్‌ తొలిదశలో 53.54% ఓటింగ్‌

బీహార్‌ తొలిదశలో 53.54% ఓటింగ్‌

  • బీహార్‌ తొలిదశలో వెల్లివిరిసిన చైతన్యం
  • వైరస్‌ నేపథ్యంలో ఓటింగ్‌ గంట పొడిగింపు

పట్నా: బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా బుధవారం మొదటి దశ పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. బుధవారం 71 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. కరోనా నేపథ్యంలోనూ బీహార్‌ ప్రజలు చైతన్యాన్ని ప్రదర్శించారు. తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.  సాయంత్రం 6 గంటల సమయానికి 53.54 శాతం ఓటింగ్‌ జరిగింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో(2015) మొదటిదశ పోలింగ్‌లో 54.94 శాతం ఓటింగ్‌ నమోదైంది. మొదటి దశ ఎన్నికల్లో భాగంగా 31వేల పోలింగ్‌ బూత్‌లను ఏర్పాటు చేశారు. అన్ని చోట్ల థర్మల్‌ స్కానింగ్‌, శానిటైజర్లు, మాస్క్‌లు తప్పనిసరిచేశారు. పోలింగ్‌ బూత్‌ల దగ్గర ప్రజలు గుమికూడకుండా మొట్టమొదటిసారిగా పోలింగ్‌ సమయాన్ని గంట(సాయంత్రం 6 గంటల వరకు) పొడిగించారు. సమయం ముగిసినా క్యూలైన్లలో జనం ఎక్కువగా ఉండటంతో ఓటింగ్‌ శాతం ఇంకా పెరిగే అవకాశం ఉన్నదని ఎన్నికల సంఘం ఒక ప్రకటనలో పేర్కొన్నది. రెండో దళ పోలింగ్‌ నవంబర్‌ 3న, చివరి దశ పోలింగ్‌ నవంబర్‌ 7న జరగనున్నది. బీహార్‌ మంత్రి, బీజేపీ నేత, గయ అభ్యర్థి ప్రేమ్‌ కుమార్‌ కమలం గుర్తు ఉన్న మాస్క్‌ ధరించి ఓటేశారు. దీనిపై కేసు నమోదు చేయాల్సిందిగా ఎన్నికల సంఘం అధికారులను అదేశించింది. 

తేజస్వీ ఆటవిక రాజ్యపు యువరాజు: మోదీ

ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌ను ‘ఆటవిక రాజ్యానికి యువరాజు’ అని ప్రధాని మోదీ విమర్శించారు. తేజస్వీ యాదవ్‌తో జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు సూచించారు. తాము అధికారంలోకి వస్తే 10 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామన్న తేజస్వీ హామీని మోదీ ఈ సందర్భంగా ప్రస్తావించారు. వాళ్లు అధికారంలోకి వస్తే ఇప్పటికే ఉద్యోగాలు కల్పిస్తున్న ప్రైవేటు కంపెనీలు కూడా పారిపోతాయి అని ఎద్దేవా చేశారు. కాగా, మోదీ నిరుద్యోగం గురించి ఎందుకు ప్రస్తావించరని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత రాహుల్‌ గాంధీ  ప్రశ్నించారు.