మహాబలేశ్వరం, జూలై 22: మహాబలేశ్వరంలో బుధవారం నుంచి గురువారం సాయంత్రం 5 గంటల వరకు కేవలం 33 గంటల వ్యవధిలో రికార్డు స్థాయిలో 80.2 సెంటీమీటర్ల కుంభవృష్టి కురిసింది. గురువారం ఒక్కరోజే 48 సెంటీమీటర్ల వాన పడింది. గడిచిన 52 ఏండ్లలో ఒక్క రోజులో ఇంత భారీ వాన కురవడం ఇది రెండోసారి. 1970లో జూన్లో 48 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షం కురిసింది. ఇక జూలై నెల పరంగా చూస్తే ఇంత వాన ఇప్పటివరకు కురవలేదు. మహాబలేశ్వరం మహారాష్ట్రంలోని సతారా జిల్లాలో ఉన్నది. కొండలతో కూడి ఉన్న ఈ ప్రాంతంలోనే కృష్ణా నది పుడుతుంది. తాజాగా కురిసిన వర్షాలతో నదికి భారీ వరద ముప్పు పొంచి ఉన్నది. మహాబలేశ్వరంలో ఏడాది సగటు వర్షపాతం 571 సెంటీమీటర్లు.