బుధవారం 01 ఏప్రిల్ 2020
National - Feb 13, 2020 , 11:32:21

ఢిల్లీ ఎమ్మెల్యేల్లో 52 మంది కోటీశ్వరులు

ఢిల్లీ ఎమ్మెల్యేల్లో 52 మంది కోటీశ్వరులు

న్యూఢిల్లీ : ఢిల్లీ ఏడో అసెంబ్లీలో ధనవంతులే అధికంగా ఉన్నారు. గత అసెంబ్లీలతో పోలిస్తే.. ఈ సారి 70 మంది ఎమ్మెల్యేల్లో 52 మంది కోటీశ్వరులు ఉన్నారు. 2015లో 44 మంది కోటీశ్వరులు ఉంటే.. ఇప్పుడు ఆ సంఖ్య కాస్త పెరిగింది. ప్రస్తుతం ఒక్కో ఎమ్మెల్యే సగటు ఆస్తులు రూ. 14.3 కోట్లు కాగా, గత అసెంబ్లీలో ఒక్కో ఎమ్మెల్యే సగటు ఆస్తులు రూ.6.3 కోట్లు మాత్రమే. 2008లో 47 మంది కోటీశ్వరులు, 2013లో 51 మంది కోటీశ్వరులు.. ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ప్రస్తుత అసెంబ్లీలో అత్యంత ధనవంతుడైన ఎమ్మెల్యే ధర్మపాల్‌ లక్రా. ఈయన ఆస్తులు రూ.292.1 కోట్లు. ఇక పేద ఎమ్మెల్యే రాఖీ బిద్లాన్‌.. ఈయన ఆస్తులు కేవలం రూ.76,421 మాత్రమే.

ప్రస్తుత అసెంబ్లీకి ఎన్నికైన ఎమ్మెల్యేల్లో గ్రాడ్యుయేట్‌లు 42 మంది ఉండగా, 12వ తరగతి వరకు చదివిన వారు 23 మంది ఉన్నారు. 2015లో గ్రాడ్యుయేట్స్‌ 43 మంది, 12వ తరగతి వరకు చదివిన వారు 24 మంది కాగా, 2013లో గ్రాడ్యుయేట్స్‌ 36 మంది, 12వ తరగతి వరకు చదివిన వారు 33 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో 51 ఏళ్లకు పైగా ఉన్న ఎమ్మెల్యేలు 31 మంది అయితే 25 నుంచి 50 ఏళ్ల మధ్య వయసున్న ఎమ్మెల్యేలు 39 మంది. అత్యంత వృద్ధ ఎమ్మెల్యే రామ్‌ నివాస్‌ గోయల్‌(72) కాగా, అత్యంత పిన్న వయసున్న ఎమ్మెల్యే కుల్దీప్‌ కుమార్‌(30). 2008లో ముగ్గురు మహిళా ఎమ్మెల్యేలు ఉండగా, 2013లో ముగ్గురు, 2015లో ఆరుగురు, 2020లో ఎనిమిది మంది మహిళా ఎమ్మెల్యేలు ఉన్నారు. 


logo
>>>>>>