శుక్రవారం 03 జూలై 2020
National - Jun 14, 2020 , 18:17:40

ఒడిశాలో బయటపడిన 500 ఏండ్లనాటి ఆలయం

ఒడిశాలో బయటపడిన 500 ఏండ్లనాటి ఆలయం

భువనేశ్వర్‌: ఒడిశా రాష్ట్రంలోని మహానదిలో మునిగిపోయిన పురాతన ఆలయం బయటపడింది. ఈ ఆలయం దాదాపు 500 ఏండ్ల క్రితం నాటిదని పురాతత్వశాఖ పరిశోధకులు తేల్చారు. కటక్‌లోని పద్మావతి ప్రాంతంలోని బైదేశ్వర్‌ సమీపంలోని మహానదిలో చేపట్టిన ఒక ప్రాజెక్టులో భాగంగా జరిపిన తవ్వకాల్లో 60 అడుగుల లోతులో ఈ గుడిని కనుగొన్నట్లు అధికారులు చెప్తున్నారు. ఈ ఆలయం 15 వ శతాబ్దం చివరలో లేదా 16 వ శతాబ్దం ఆరంభంలో నిర్మించి ఉంటారని, మస్తాకా శైలిలో నిర్మాణాలు ఉన్నాయని అధికారులు వెల్లడించారు. స్థానిక వారసత్వ ఔత్సాహికుడు రవీంద్ర రానా సాయంతో ఇంటాచ్‌ ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌ దీపక్‌ కుమార్‌ నాయక్‌ ఈ ఆలయాన్ని గుర్తించారు.

ఆలయాన్ని పునరుద్ధరించేందుకు ఆర్కియాలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా వారితో సంప్రదిస్తున్నట్లు ఇండియన్‌ నేషనల్‌ ట్రస్ట్‌ ఫర్‌ ఆర్ట్‌ అండ్‌ కల్చరల్‌ హెరిటేజ్‌ ప్రాజెక్ట్‌ కోఆర్డినేటర్‌ అనిల్‌ ధీర్‌ తెలిపారు. ఆలయాన్ని అనువైన ప్రదేశానికి తరలించేందుకు చర్యలు తీసుకోవాలని ఏఎస్‌ఐకి లేఖ రాసినట్లు ఆయన చెప్పారు. మహానదిలో ఇప్పటివరకు దాదాపు 65 ఆలయాలను కనుగొన్నామని ఆయన వెల్లడించారు. హిరాకుడ్‌ జలాశయం నిర్మాణం సమయంలో అనేక దేవాలయాలు కూల్చివేసి పునర్మించారని పేర్కొన్నారు. 

ఇంటాచ్‌ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఆలయం గోపీనాథ్‌ దేవ్‌కు అంకితమిచ్చారు. ఆ రోజుల్లో ఈ ప్రాంతాన్ని సత్పతన అని పిలిచేవారు. ప్రకృత్తి విపత్తులు వరదల కారణంగా మహానది తన మార్గాన్ని మార్చుకోవడంతో ఈ గ్రామం పూర్తిగా మునిగిపోయింది. 19వ శతాబ్దంలో ఆలయాలను సురక్షితమైన, ఎత్తైన ప్రాంతాలకు తరలించారు. ప్రస్తుతం బయటపడిన ఆలయం పద్మావతి గ్రామానికి చెందిన గోపీనాథ్‌ ఆలయంగా భావిస్తున్నారు. ఒడిశాలోని ఇంటాచ్‌.. మహానది లోయ యొక్క వారసత్వంపై డాక్యుమెంటరీ తయారీలో భాగంగా ఈ ప్రాజెక్టును గత ఏడాది ప్రారంభించారు. మహానది ప్రారంభం నుంచి సముద్రంలో కలిసేంత వరకు 1,700 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది.


logo