మంగళవారం 26 జనవరి 2021
National - Jan 07, 2021 , 01:31:58

50 ఏండ్ల ‌మహిళపై దారుణం, హత్య

50 ఏండ్ల ‌మహిళపై దారుణం, హత్య

  • పక్కటెముకలు, కాలు విరిచేసి ఘాతుకం
  • ‘నిర్భయ’ ఘటనను తలపించేంత రాక్షసత్వం
  • యూపీలో ఘోర కలి.. పూజారులే నిందితులు
  • బీజేపీపై విరుచుకుపడ్డ కాంగ్రెస్‌, ఎస్పీ, బీఎస్పీ
  • లైంగికదాడికి పాల్పడి, ఆమెను తీవ్రంగా గాయపరిచి.. ఏమీ తెలియనట్టు మళ్లీ ఆమెను ఇంటివద్ద వదిలేసి పారిపోయిన దుండగులు

స్త్రీలు ఎక్కడ గౌరవింపబడతారో.. అక్కడ దేవతలు నివాసముంటారని పురాణాలు ఘోషించాయి.  అయితే, ఆ దేవుడి సన్నిధిలో కూడా ఆడబిడ్డలకు రక్షణ లేకుండా పోయింది. ఆలయానికి వెళ్లిన ఓ 50 ఏండ్ల అంగన్‌వాడీ కార్యకర్తపై ఆ గుడి పూజారి, అతని సహచరులు లైంగిక దాడికి పాల్పడి, హత్య చేయడం విస్తుగొలుపుతున్నది. మరో ‘నిర్భయ’ను తలపించే ఈ భీతావహ ఘటన యూపీలో జరిగింది.

బదాయూ (యూపీ), జనవరి 6: దేశంలో మహిళలపై అఘాయిత్యాలు పెరుగుతున్నాయి. యూపీలోని హాథ్రస్‌లో సామూహిక లైంగికదాడి, హత్య ఘటనను మరిచిపోక ముందే మరో దారుణ ఘటన కలకలం రేపుతున్నది. ఆలయానికి వెళ్లిన ఓ 50 ఏండ్ల మహిళపై ఆ గుడి పూజారి సత్యనారాయణ్‌ దాస్‌, అతని ఇద్దరు సహచరులు వేద్రమ్‌, జస్పాల్‌.. సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ దారుణ ఘటన యూపీలోని బదాయూ జిల్లాలో ఆదివారం చోటు చేసుకున్నది. పోస్ట్‌మార్టం నివేదిక వచ్చిన తర్వాత మంగళవారం రాత్రి ఇద్దరు నిందితులు వేద్రమ్‌, జస్పాల్‌ను అరెస్టు చేసినట్టు బుధవారం పోలీసులు తెలిపారు. ప్రధాన నిందితుడైన పూజారి సత్యనారాయణ్‌ దాస్‌ పరారీలో ఉన్నాడని, అతన్ని పట్టుకోవడానికి నాలుగు పోలీసు బృందాలు గాలింపు చర్యలు ప్రారంభించాయన్నారు. పోస్ట్‌ మార్టం నివేదిక ప్రకారం చనిపోయిన మహిళ పక్కటెముకలు, కాలు విరిగిపోయాయి. మృతురాలి రహస్య అవయవాల్లోకి రాడ్డును చొప్పించడం వల్ల తీవ్ర రక్త స్రావమైంది. బలమైన ఆయుధంతో దాడి చేయడం వల్ల ఆమె ఊపిరితిత్తులు కూడా దెబ్బ తిన్నాయి.

బాధితురాలి రహస్య అవయవాలకు తీవ్ర గాయాలైనట్టు సీనియర్‌ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ (ఎస్‌ఎస్‌పీ) సంకల్ప్‌ శర్మ తెలిపారు. కేసు విషయమై ఉన్నతాధికారులకు సమాచారాన్ని చేరవేయడంలో జాప్యం చేసిన ఉఘైతి స్టేషన్‌ హౌజ్‌ ఆఫీసర్‌ను సస్పెండ్‌ చేసినట్టు పేర్కొన్నారు. గాయాలు, తీవ్ర రక్తస్రావం కావడంతోనే మహిళ మరణించినట్టు బదాయూ సీఎంవో డాక్టర్‌ యశ్‌పాల్‌ సింగ్‌ తెలిపారు. మరోవైపు, బదాయూ మహిళ గ్యాంగ్‌ రేప్‌, హత్య ఘటనపై యూపీ పోలీసులు వెంటనే జోక్యం చేసుకోవాలని జాతీయ మహిళ కమిషన్‌ పేర్కొంది. ఈ మేరకు కమిషన్‌ చైర్‌పర్సన్‌ రేఖా శర్మ యూపీ డీజీపీకి ఓ లేఖను రాశారు. ఘటనపై దర్యాప్తును వేగవంతం చేయాలని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ అధికారులను ఆదేశించారు. 

నిందితులే తీసుకొచ్చారు

ఆదివారం సాయంత్రం గుడికి వెళ్లిన తన తల్లిని అదే రాత్రి 11 గంటల సమయంలో ఆలయ పూజారి, అతని సహచరులు ఇంటికి తీసుకువచ్చారని ఆమె కుమారుడు తెలిపారు. అప్పుడు ఆమె తీవ్రంగా గాయపడి ఉన్నదని చెప్పారు. నీరులేని బావిలో పడిపోతే ఆమెను బయటకు తీసి ఇక్కడికి తీసుకువచ్చామని చెప్పి.. పూజారి, అతని సహచరులు హడావుడిగా వెళ్లిపోయారని వెల్లడించారు. ఆ తర్వాత ఆమె మరణించినట్టు చెప్పారు.  సోమవారమే పోలీసులను ఆశ్రయించినా నిర్లక్ష్యం వహించారని ఆరోపించారు. చనిపోయిన మహిళ అంగన్‌వాడీ కార్యకర్త అని జిల్లా కలెక్టర్‌ కుమార్‌ ప్రశాంత్‌ తెలిపారు. అవసరమైతే మృతురాలి కుటుంబానికి భద్రత కల్పిస్తామన్నారు. 

భగ్గుమన్న విపక్షాలు

అంగన్‌వాడీ కార్యకర్తపై జరిగిన సామూహిక లైంగిక దాడి, హత్య యూపీ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నది. మహిళలకు భద్రత కల్పించడంలో యోగి ఆదిత్యనాథ్‌ సర్కార్‌ విఫలమయ్యిందని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ విమర్శించారు. ఈ ఘటన అత్యంత హేయమైనదని, మానవత్వానికి సిగ్గుచేటని ఆ పార్టీ అధికార ప్రతినిధి రణ్‌దీప్‌ సూర్జేవాలా మండిపడ్డారు. ఆదిత్యనాథ్‌ ప్రభుత్వం నిద్రలేవాలంటే ఇంకా ఎంతమంది మహిళలు బలవ్వాలని ప్రశ్నించారు. నిందితులను వెంటనే శిక్షించాలని సమాజ్‌వాదీ పార్టీ డిమాండ్‌ చేసింది. మహిళల భద్రత విషయంలో రాష్ట్ర బీజేపీ విఫలమయ్యిందని ఆరోపించింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా నేరస్తులకు కఠిన శిక్ష విధించాలని బహుజన్‌ సమాజ్‌ పార్టీ అధినేత్రి మాయావతి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.


logo