ఆదివారం 17 జనవరి 2021
National - Dec 17, 2020 , 16:40:57

50 కోట్లు సేక‌రించి.. 34 కోట్లే ఖ‌ర్చు చేశారు..

50 కోట్లు సేక‌రించి.. 34 కోట్లే ఖ‌ర్చు చేశారు..

న్యూఢిల్లీ : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నిక‌లు ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రి నెల‌లో జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ ఎన్నిక‌ల కోసం ఆయా పార్టీలు రూ. 49.99 కోట్లు సేక‌రించాయి. కానీ ఎన్నిక‌ల్లో అన్ని పార్టీలు క‌లిసి ఖ‌ర్చు పెట్టింది మాత్రం రూ. 34.32 కోట్లే అని అసోసియేష‌న్ ఫ‌ర్ డెమోక్ర‌టిక్ రిఫార్మ్స్(ఏడీఆర్) ఓ నివేదిక‌ను విడుద‌ల చేసింది. ఎన్నిక‌లు పూర్త‌యిన 75 రోజుల లోపే అన్ని రాజ‌కీయ పార్టీలు తాము చేసిన ఖ‌ర్చును కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి స‌మ‌ర్పించాలి. కానీ ఢిల్లీలో ఎన్నిక‌లు ముగిసి 230 రోజులు గ‌డుస్తున్న‌ప్ప‌టికీ కొన్ని పార్టీలు త‌మ ఖ‌ర్చుల వివ‌రాల‌ను ఎన్నిక‌ల సంఘానికి అందించ‌లేదు. భార‌తీయ జ‌న‌తా పార్టీ, నేష‌న‌లిస్ట్ కాంగ్రెస్ పార్టీ, సీపీఐ, జ‌న‌తాద‌ళ్(యూనైటెడ్‌) పార్టీలు ఇంకా ఎన్నిక‌ల ఖ‌ర్చుల వివ‌రాల‌ను అందించ‌లేద‌ని ఏడీఆర్ పేర్కొంది. ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్, సీపీఐ(ఎం), బీఎస్పీలు క‌లిసి 62.2 శాతం నిధుల‌ను ఖ‌ర్చు చేశారు. ఎల్జేపీ మాత్రం ఢిల్లీ ఎన్నిక‌ల కోసం ఒక్క రూపాయిని కూడా సేక‌రించ‌లేదు. అయితే ఆప్ మాత్రం 51 శాతం నిధుల‌ను ఎన్నిక‌ల కోసం ఖ‌ర్చు చేసిన‌ట్లు ఏడీఆర్ తెలిపింది.