శనివారం 28 నవంబర్ 2020
National - Nov 20, 2020 , 01:54:11

కొవిడ్‌ యోధుల పిల్లలకు 5 ఎంబీబీఎస్‌ సీట్లు

కొవిడ్‌ యోధుల పిల్లలకు 5 ఎంబీబీఎస్‌ సీట్లు

న్యూఢిల్లీ: కొవిడ్‌ యోధుల పిల్లలకు 5 ఎంబీబీఎస్‌ సీట్లను కేటాయించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్రం పూల్‌ కింద 2020-21 విద్యా సంవత్సరానికి మాత్రమే ఈ సీట్లు కేటాయిస్తారు. ఈ మేరకు విద్యార్థుల ఎంపికకు సంబంధించిన మార్గదర్శకాల్లో ‘కొవిడ్‌ యోధుల పిల్లలు’ పేరిట కేంద్ర ఆరోగ్య శాఖ కొత్త కేటగిరీని చేర్చింది. కరోనా మహమ్మారిపై యుద్ధంలో, సంబంధిత విధుల్లో ప్రమాదవశాత్తు మరణించినవారి త్యాగాన్ని గౌరవిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ శాఖ మంత్రి హర్షవర్ధన్‌ గురువారం తెలిపారు. నీట్‌-2020లో సాధించిన ర్యాంకు ఆధారంగా ఆన్‌లైన్‌ దరఖాస్తు ద్వారా విద్యార్థులను మెడికల్‌ కౌన్సిల్‌ కమిటీ (ఎంసీసీ) ఎంపిక చేస్తుందని పేర్కొన్నారు. కొవిడ్‌ యోధులుగా ఎవరిని పరిగణిస్తారనే అంశాన్ని గతంలో వారికి రూ.50 లక్షల బీమా ప్యాకేజీ ప్రకటించిన సమయంలోనే కేంద్రం వివరించిందని చెప్పారు. కొవిడ్‌-19 రోగులకు ప్రత్యక్షంగా సేవలందించిన సామాజిక ఆరోగ్య కార్యకర్తలు సహా ప్రజారోగ్య రంగానికి చెందినవారిని కొవిడ్‌ యోధులుగా గుర్తించినట్లు పేర్కొన్నారు. ఈ కేటగిరీకి అర్హతను రాష్ర్టాలు ధ్రువీకరిస్తాయని చెప్పారు. 

వైద్య విద్యలో ప్రభుత్వ బడుల విద్యార్థులకు కోటా

తమిళనాడు ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులకు వైద్య విద్యలో 7.5 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తోంది. దీనివల్ల వారికి ప్రస్తుత విద్యా సంవత్సరంలో 405 సీట్లు లభిస్తాయని ముఖ్యమంత్రి కే పళనిస్వామి తెలిపారు. కౌన్సెలింగ్‌ అనంతరం ఈ కోటా కింద సీట్లు పొందిన విద్యార్థులకు గురువారం ఆయన ధృవపత్రాలు అందజేశారు. ఈ కోటా వల్ల ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులకు 313 ఎంబీబీఎస్‌ సీట్లు, 92 బీడీఎస్‌ సీట్లు లభిస్తాయి. ఈ నిర్ణయం ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల జీవితాల్లో మంచి మార్పు తీసుకువస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.