శుక్రవారం 15 జనవరి 2021
National - Jan 12, 2021 , 13:18:24

48 వ రోజుకు చేరిన రైతు ఉద్యమం

48 వ రోజుకు చేరిన రైతు ఉద్యమం

న్యూఢిల్లీ : కేంద్ర నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపడుతున్న ఉద్యమం 48 వ రోజుకే చేరింది. రైతులకు మద్దతుగా బాబా నసీబ్ సింగ్ మన్ పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్‌లో తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. డిసెంబర్ 20 న జరిగిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. రైతుల సమస్యలు పరిష్కారం కాకపోతే చనిపోతానని చెప్పినట్లు తోటి రైతులు తెలిపారు. మన్ సోదరుడికి ఖలీస్తాన్ ఉద్యమంతో సంబంధం ఉన్నదని చెప్తున్నారు. కాగా, 48 రోజుల ఉద్యమంలో ఇప్పటివరకు దాదాపు 57 మంది చనిపోయారు. వీరిలో కొందరు ఆత్మహత్య చేసుకోగా.. మరికొందరికి గుండెపోటు వచ్చింది. అనారోగ్యం కారణంగా చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. చలి ఎక్కువగా ఉన్నందున రైతులు, వృద్ధులు, మహిళలు, చిన్నారులు ఇళ్లకు వెళ్లిపోవాలని సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ బోబ్డే కోరినప్పటికీ ఫలితం లేకపోయింది. రైతుల ఉద్యమంపై విచారం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు.. కేంద్ర ప్రభుత్వ తీరును విమర్శించింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే చట్టలను అమలుచేయకుండా నిలుపుదల చేయాల్సి వస్తుందని సుప్రీంకోర్టు ధర్మాసనం హెచ్చరించింది. 

ఢిల్లీ సరిహద్దులో తీవ్రమైన చలి వాతావరణం ఉన్నప్పటికీ రైతులు అక్కడే ఉంటున్నారు. పొగమంచు తీవ్రంగా ఉండటం, చల్లటి గాలులు వేగంగా వీస్తుండటంతో చాలా మంది రైతులు అనారోగ్యం పాలవుతున్నారు. మహిళలు, చిన్నపిల్లలు కూడా ఇబ్బందిపడుతున్నారు. కేంద్రం తన చట్టాలను వెనక్కి తీసుకునే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని రైతులు చెప్తున్నారు. ఇలావుండగా, నిరసనలు చేస్తున్న వారికి డబ్బులు అందుతున్నాయని బీజేపీ ఎంపీ ఎస్ మునిస్వామి సోమవారం చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. ఉద్యమంలో నకిలీ రైతులు ఉన్నారని, పిజ్జా-బర్గర్లు తింటూ ఎంజాయ్‌ చేస్తున్నారని, వెంటనే ఈ నాటకాలకు స్వస్థిపలుకాలని మునిస్వామి వ్యాఖ్యానించారు.

రైతు ఉద్యమం రోడ్‌మ్యాప్

ఈ నెల 13న కిసాన్ సంకల్ప్ దివాస్ జరుపుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వ్యవసాయ చట్టాల కాపీలను తగులబెట్టేందుకు కార్యాచరణ సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. జనవరి 18 ను రైతు మహిళా దినోత్సవం,  జనవరి 23 న నేతాజీ సుభాష్ చంద్రబోస్‌ జయంతి సందర్భంగా వివిధ గ్రామాల రైతులు ఢిల్లీకి బయలుదేరాలని నిర్ణయించారు. ప్రతి గ్రామం నుంచి 5 చొప్పున ట్రాక్టర్లతో 26న ఢిల్లీని ముట్టడించాలని ప్రణాళిక వేసుకున్నారు. కాగా, రైతులు ఉద్యమం ఇంత తీవ్రంగా జరుగుతున్నా.. కేంద్ర ప్రభుత్వం ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు. కరోనా వైరస్‌ మహమ్మారి నిరోధానికి వేసే వ్యాక్సిన్లపైనే దృష్టిని సారించింది. ఈ నెల 16న దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ నిరోధక వ్యాక్సిన్‌ అందజేసేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా జరుపుతున్నారు.