గురువారం 09 జూలై 2020
National - Jun 20, 2020 , 15:37:52

డెహ్రాడూన్‌లో 48 గంట‌లపాటు క‌ఠిన లాక్‌డౌన్‌

డెహ్రాడూన్‌లో 48 గంట‌లపాటు క‌ఠిన లాక్‌డౌన్‌

డెహ్రాడూన్‌: ఉత్త‌రాఖండ్ రాష్ట్ర రాజ‌ధాని డెహ్రాడూన్‌లో 48 గంట‌ల‌పాటు క‌ఠిన లాక్‌డౌన్ విధించారు. శ‌నివారం ఉద‌యం 7 గంట‌ల నుంచి సోమ‌వారం ఉద‌యం 7 గంట‌ల వ‌ర‌కు ఈ లాక్‌డౌన్ అమ‌ల్లో ఉంటుంద‌ని డెహ్రాడూన్ న‌గ‌ర సూప‌రింటెండెంట్ ఆఫ్ పోలీస్ స్వేత చౌబే చెప్పారు. రాష్ట్రంలో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండ‌టంతో శ‌ని, ఆదివారాలు న‌గ‌రంలో క‌ఠిన లాక్‌డౌన్ అమ‌లు చేస్తున్నామ‌ని ఆమె తెలిపారు. 

ఈ 48 గంట‌ల లాక్‌డౌన్ స‌మ‌యంలో అత్య‌వ‌స‌రాలు, నిత్య‌వ‌స‌రాల‌కు సంబంధించిన మెడిక‌ల్ షాపులు, క్లినిక్‌లు, ఆస్ప‌త్రులు, కిరాణా దుకాణాలు త‌ప్ప మిగ‌తా అన్ని ర‌కాల షాపులు, సంస్థ‌లు మూసే ఉంటాయ‌ని డెహ్రాడూన్ పోలీసులు స్ప‌ష్టం చేశారు. కాగా, ఐసీఎమ్మార్ లెక్క‌ల ప్ర‌కారం ఉత్త‌రాఖండ్‌లో ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 2,177 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. అందులో 1433 మంది వైర‌స్ బారి నుంచి కోలుకుని డిశ్చార్జి కాగా, 718 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 26 మంది క‌రోనా రోగులు మృతిచెందారు.  


logo