గురువారం 09 జూలై 2020
National - Jun 25, 2020 , 14:14:25

ఆ చీకటి రోజులను మరిచిపోగలమా?!

ఆ చీకటి రోజులను మరిచిపోగలమా?!

న్యూఢిల్లీ : దేశంలో అత్యవసర పరిస్థితి విధించి నేటికి 45 సంవత్సరాలు పూర్తయ్యాయి. 1975 జూన్ 25న అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ అర్ధరాత్రి అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. ఇది భారత రాజకీయ చరిత్రలో ఒక చీకటి అధ్యాయంగా పరిగణించబడుతుంది. దేశంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి పోరాడిన వారికి నివాళి అర్పిస్తున్నానని ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఇదే సమయంలో, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా దీనిని చరిత్ర చీకటి రోజుగా అభివర్ణించారు.

'సరిగ్గా 45 సంవత్సరాల క్రితం దేశంలో అత్యవసర పరిస్థితి విధించబడింది. ఆ సమయంలో, భారతదేశ ప్రజాస్వామ్యం రక్షణ కోసం పోరాడిన వారు, హింసను అనుభవించిన వారందరికీ వందనం చేస్తున్నాను. వారి త్యాగాన్ని దేశం ఎప్పటికీ మరచిపోదు' అని నరేంద్ర మోదీ ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. కాగా, అత్యవసర పరిస్థితి విధించడంపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా.. కాంగ్రెస్, గాంధీ కుటుంబాన్ని ప్రశ్నించారు. 'భారతదేశ ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి కాంగ్రెస్‌ పార్టీ..  అత్యవసర మనస్తత్వాన్ని ఎందుకు కొనసాగించామని స్వయంగా ప్రశ్నించుకోవాలి' అని ట్వీట్ చేశారు. రాజవంశానికి చెందిన వారు ఏమీ మాట్లాడలేకపోతున్నారా? కాంగ్రెస్‌లో నాయకులు ఎందుకు విసుగు చెందుతున్నారు?' అంటూ ఆయన ప్రశ్నించారు.

'ఈ రోజు భారతదేశ చరిత్రలో చీకటి దినం. ఒక కుటుంబం యొక్క రాజకీయ లిప్సా ప్రజాస్వామ్య విలువలను, తల్లి భారతి గొంతు కోసి అత్యవసర పరిస్థితిని విధించింది. ఆనాడు ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడిన ప్రజలకు నమస్సుమాంజలులు. వారి త్యాగాలు ప్రజాస్వామ్యాన్ని తిరిగి స్థాపించడం ద్వారా తల్లి భారతికి కీర్తిని తెచ్చాయి' అని ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యాతనాథ్‌ ట్వీట్‌ చేశారు. తనపై కోర్టు నిర్ణయం ఉన్నప్పటికీ పట్టించుకోని అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ అత్యవసర పరిస్థితి విధించి ప్రజలను జైలులో పెట్టారని, ఇది ఏ భారతీయుడు మరిచిపోయే విషయం కాదని లోక్‌దళ్‌ పార్టీ నాయకుడు అభయ్ చౌతాలా అన్నారు.logo