బుధవారం 21 అక్టోబర్ 2020
National - Oct 05, 2020 , 07:35:59

నేడు జీఎస్టీ మండ‌లి స‌మావేశం.. పూర్తి ప‌రిహారం చెల్లించాలంటున్న రాష్ట్రాలు

నేడు జీఎస్టీ మండ‌లి స‌మావేశం.. పూర్తి ప‌రిహారం చెల్లించాలంటున్న రాష్ట్రాలు

హైద‌రాబాద్‌: జీఎస్టీ ప‌రిహారం చెల్లింపుల విష‌యంలో కేంద్ర ప్ర‌తిపాద‌న‌లు రాష్ట్రాలు వ్య‌తిరేకిస్తున్న వేళ నేడు 42వ జీఎస్టీ మండ‌లి స‌మావేశం జ‌ర‌గ‌నుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మాలా సీతారామ‌న్ ఆధ్వ‌ర్యంలో మండ‌లి ఈరోజు స‌మావేశంకానుంది. ఈ సంద‌ర్భంగా జీఎస్టీ ప‌రిహారం చెల్లింపుల‌పై స్ప‌ష్ట‌త వ‌చ్చే అవ‌కాశం ఉంది. రాష్ట్రాల‌కు చెల్లించే ప‌రిహారంపై ఓ నిర్ణ‌యం తీసుకోనుంది. జీఎస్టీ ప‌రిహారం విష‌యంలో బీజేపీ యేత‌ర రాష్ట్ర ప్ర‌భుత్వాలు కేంద్రంతో విభేదిస్తున్నాయి. పూర్తి ప‌రిహారాన్ని కేంద్రమే చెల్లించాల‌ని డిమాండ్ చేస్తున్నాయి.  

గ‌త స‌మావేశంలో జీఎస్టీ మండ‌లి చేసిన‌ రెండు ప్ర‌తిపాద‌న‌ల‌ను తెలంగాణ‌ ప్ర‌భుత్వం తిర‌స్క‌రించింది. తొలి ప్ర‌తిపాద‌న మేర‌కు రాష్ట్రానికి రూ.5 వేల కోట్లు, రెండో ప్ర‌తిపాద‌న ప్ర‌కారం రూ.10 వేల కోట్ల ప‌రిహారం రావాల్సి ఉంటుంద‌ని అంచ‌నా. ప‌రిహారాన్ని మొత్తం కేంద్ర‌మే చెల్లించాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం కోరుతున్న‌ది. క‌రోనా, జీఎస్టీ వ‌ల్ల రూ.2.37 కోట్లు న‌ష్ట‌పోయామ‌ని, దాన్ని కేంద్ర‌ప్ర‌భుత్వ‌మే చెల్లించాల‌ని డిమాండ్ చేస్తున్న‌ది. లోటును పూడ్చుకోవ‌డానికి రాష్ట్రాలు అప్పులు తీసుకోవాల‌న్న ప్ర‌తిపాద‌న‌ను ప్ర‌భుత్వం తిర‌స్క‌రించింది. కేంద్ర‌మే ఆర్బీఐ నుంచి రుణం తీసుకుని పూర్తి ప‌రిహారం చెల్లించాల‌ని కోరుతున్న‌ది.  

షెడ్యూల్ ప్ర‌కారం గ‌తనెల 14న జ‌ర‌గాల్సిన 42వ జీఎస్టీ మండ‌లి భేటీ పార్ల‌మెంట్ స‌మావేశాల వల్ల వాయిదాప‌డింది. 


logo