'40 ఇయర్స్ విత్ అబ్దుల్ కలాం- అన్టోల్డ్ స్టోరీస్' పుస్తకావిష్కరణ

ఢిల్లీ : డాక్టర్ శివతాను పిళ్లై రచించిన 40 ఇయర్స్ విత్ అబ్దుల్ కలాం- అన్టోల్డ్ స్టోరీస్ పుస్తకాన్ని ఉపరాష్ర్టపతి వెంకయ్యనాయుడు గురువారం విడుదల చేశారు. వర్చువల్ సమావేశం ద్వారా ఉప రాష్ర్టపతి ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా యువతను ఉద్దేశించి వెంకయ్య నాయుడు మాట్లాడుతూ.. దేశ యువత మాజీ రాష్ర్టపతి డాక్టర్ అబ్దుల్ కలాం నుండి ప్రేరణ పొందాలన్నారు. బలమైన, స్వావలంబన, సమగ్ర భారత దేశాన్ని నిర్మించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చడానికి కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేద్దామన్నారు.
గ్రామాలు, చిన్న పట్టణాల్లో ఉపాధి, ఆర్థిక అవకాశాలను సృష్టించాల్సిన అవసరాన్ని ఉపరాష్ట్రపతి నొక్కి చెప్పారు. వివిధ ఆర్థిక, సామాజిక సవాళ్లకు పరిష్కారాలను అందించేందుకు యువత ఆలోచించాలన్నారు. డాక్టర్ కలాం నిజమైన కర్మ యోగి అన్నారు. ప్రతి భారతీయుడికి ప్రేరణ అన్నారు. డాక్టర్ కలాం సలహాను అనుసరించి, స్థిరమైన, పర్యావరణ అనుకూలమైన అభివృద్ధి మార్గాన్ని అవలంబించాల్సిన సమయం ఇదే అన్నారు.