బెయిర్‌స్టో సెంచరీ.. స్టోక్స్ మెరుపులు
రెండో వన్డేలో భారత్‌పై ఇంగ్లండ్ ఘనవిజయం
1-1తో సిరీస్ సమం
రాహుల్ సెంచరీ వృథా
రాహుల్ రాకింగ్ సెంచరీకి పంత్, పాండ్యా పవర్ఫుల్ ఇన్నింగ్స్‌లు తోడవడంతో కోహ్లీసేన భారీ స్కోరు చేసింది!
ఇంకేముంది మరో మ్యాచ్ మిగిలుండగానే మనవాళ్లు సిరీస్ పట్టేయడం ఖాయమే! అనుకుంటున్న తరుణంలో.. బెయిర్‌స్టో, బెన్ స్టోక్స్ తుఫాన్ ఇన్నింగ్స్‌లతో విరుచుకుపడ్డారు.
‘బి’బ్యాచ్ ఊచకోత ముందు మన మెరుపులు చిన్నబోవడంతో రెండో వన్డేలో భారత్‌కు ఓటమి తప్పలేదు. ఇక సిరీస్ విజేత ఎవరో తేలాలంటే ఆదివారం ఆఖరి పోరు వరకు వేచి చూడాల్సిందే!
పుణె: తొలి మ్యాచ్‌కు యాక్షన్ రీప్లేలా సాగిన రెండో వన్డేలో ఇంగ్లండ్‌ది పైచేయి అయింది. భారీ స్కోరు చేసినా.. దాన్ని కాపాడుకోవడంలో విఫలమైన టీమ్ఇండియా ఓటమి వైపు నిలిచింది. జానీ బెయిర్‌స్టో (124; 11 ఫోర్లు, 7 సిక్సర్లు) క్లాసిక్ సెంచరీకి.. బెన్ స్టోక్స్ (52 బంతుల్లో 99; 4 ఫోర్లు, 10 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్ తోడవడంతో శుక్రవారం జరిగిన రెండో వన్డేలో ఇంగ్లండ్ 6 వికెట్ల తేడాతో గెలిచింది. ఫలితంగా మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1తో సమం చేసింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన కోహ్లీసేన నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 336 పరుగులు చేసింది. లోకేశ్ రాహుల్ (108; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) శతక్కొట్టగా.. రిషబ్ పంత్ (40 బంతుల్లో 77; 3 ఫోర్లు, 7 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కెప్టెన్ విరాట్ కోహ్లీ (66) మరోసారి అర్ధశతకంతో ఆకట్టుకోగా.. ఆఖర్లో హార్దిక్ పాండ్యా (16 బంతుల్లో 35; ఒక ఫోర్, 4 సిక్సర్లు) బౌండరీలతో విరుచుకుపడ్డాడు. ఇంగ్లండ్ బౌలర్లలో టాప్లే, టామ్ కరన్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. భారీ లక్ష్యఛేదనలో ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ బెయిర్‌స్టో, స్టోక్స్‌తో పాటు జాసన్ రాయ్ (55) కూడా రాణించడంతో ఇంగ్లండ్ 43.3 ఓవర్లలో 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 337 పరుగులు చేసింది. భారత బౌలర్లలో ప్రసిద్ధ్ కృష్ణకు 2 వికెట్లు దక్కాయి. ఇరు జట్ల మధ్య నిర్ణయాత్మక మూడు వన్డే ఆదివారం ఇక్కడే జరుగనుంది.
బెయిర్ స్ట్రోక్
లక్ష్యఛేదనలో ఇంగ్లండ్‌కు చక్కటి ఆరంభం లభించింది. ఓపెనర్లు బెయిర్‌స్టో, రాయ్ సాధికారిక ఇన్నింగ్స్‌లు ఆడటంతో ఇంగ్లండ్ 15 ఓవర్లలో వంద పరుగుల మార్క్ దాటింది. తొలి వికెట్‌కు 110 పరుగులు జోడించాక రాయ్ ఔట్ కాగా.. అక్కడి నుంచి భారత బౌలర్ల కష్టాలు రెట్టింపయ్యాయి. ఒక ఎండ్ నుంచి బెయిర్‌స్టో, మరో ఎండ్ నుంచి బెన్ స్టోక్స్ ఎదురుదాడికి దిగడంతో మనవాళ్లు చేతులెత్తేశారు. ఒక దశలో 30 బంతుల్లో 34 పరుగులు చేసిన స్టోక్స్ 10 బంతుల వ్యవధిలో ఆరు సిక్సర్లు ఒక ఫోర్ సాయంతో 51 బంతుల్లో 99కి చేరుకున్నాడు. ఈ దశలో భువనేశ్వర్ స్టోక్స్‌ను ఔట్ చేయగా.. సెంచరీ పూర్తి చేసుకున్న బెయిర్‌స్టోతో పాటు కెప్టెన్ బట్లర్ (0)ను ప్రసిద్ధ్ కృష్ణ ఒకే ఓవర్లో పెవిలియన్ పంపాడు. అయినా అప్పటికే జరుగాల్సిన నష్టం జరిగిపోగా.. ఆఖర్లో లివింగ్‌స్టోన్ (27 నాటౌట్) జట్టును విజయతీరాలకు చేర్చాడు.
బంతికి ఉమ్మి.. స్టోక్స్‌కు మందలింపు
ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ బెన్‌స్టోక్స్ మరోసారి బంతికి ఉమ్మి (సలైవా) రాస్తూ దొరికిపోయాడు. ఇటీవల డే అండ్ నైట్ టెస్టులో బంతికి లాలాజలం పూసి అంపైర్లతో చివాట్లు తిన్న స్టోక్స్ తాజా మ్యాచ్‌లో బంతికి ఉమ్మి రుద్దాడు. ఇది గుర్తించిన ఫీల్డ్ అంపైర్లు.. ఇంగ్లండ్ స్టాండిన్ కెప్టెన్ జోస్ బట్లర్‌ను పిలిచి హెచ్చరించారు. అనంతరం బంతిని శానిటైజ్ చేసి ఆటను కొనసాగించారు.
రాహుల్ రాక్స్..
విరాట్ కోహ్లీకి మరోసారి టాస్ కలిసిరాకపోగా.. ఇన్నింగ్స్ ఆరంభంలోనే భారత్‌కు షాక్ తగిలింది. గత మ్యాచ్‌లో చక్కటి ఇన్నింగ్స్‌తో అలరించిన ధావన్ (4) నాలుగో ఓవర్లోనే ఔట్ కాగా.. మంచి టచ్‌లో కనిపించిన రోహిత్ శర్మ (25) ఎక్కువసేపు నిలువలేకపోయాడు. ఈ దశలో లోకేశ్ రాహుల్‌తో కలిసి కెప్టెన్ కోహ్లీ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. చకచకా సింగిల్స్ తీస్తూ స్ట్రయిక్ రొటేట్ చేశాడు. ఈ క్రమంలో 23వ ఓవర్లో భారత్ స్కోరు వంద దాటింది. ఆ తర్వాత కాస్త జోరు పెంచిన కోహ్లీ 62 బంతుల్లో, రాహుల్ 66 బంతుల్లో అర్ధశతకాలు పూర్తి చేసుకున్నారు. మూడో వికెట్‌కు 121 పరుగులు జోడించాక కోహ్లీ ఔట్ కాగా.. పంత్ రాకతో ఇన్నింగ్స్ స్వరూపం మారిపోయింది. ఎడాపెడా బౌండ్రీలతో విరుచుకుపడిన ఈ బుడ్డోడు స్కోరు బోర్డుకు రాకెట్ వేగాన్నిచ్చాడు. సెంచరీ అనంతరం రాహుల్ వెనుదిరిగినా.. పంత్ దూకుడు తగ్గలేదు. 28 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేసుకున్న పంత్ ఈ క్రమంలో ఏడు సిక్సర్లు బాదడం విశేషం. ఆఖర్లో పాండ్యా కూడా బ్యాట్‌కు పనిచెప్పడంతో భారత్ భారీ స్కోరు చేయగలిగింది.
వన్డేల్లో ఒకే స్థానంలో బ్యాటింగ్ చేస్తూ 10 వేల పరుగులు పూర్తి చేసుకున్న మూడో ఆటగాడిగా విరాట్ కోహ్లీ రికార్డులకెక్కాడు. సచిన్ టెండూల్కర్ ఓపెనర్‌గా 13,685, రికీ పాంటింగ్ మూడో స్థానంలో 12,662 పరుగులతో ముందున్నారు.
స్కోరు బోర్డు
భారత్: రోహిత్ (సి) రషీద్ (బి) సామ్ 25, ధావన్ (సి) స్టోక్స్ (బి) టాప్లే 4, కోహ్లీ (సి) బట్లర్ (బి) రషీద్ 66, రాహుల్ (సి) టాప్లే (బి) టామ్ 108, పంత్ (సి) రాయ్ (బి) టామ్ 77, హార్దిక్ (సి) రాయ్ (బి) టాప్లే 35, కృనాల్ (నాటౌట్) 12, శార్దూల్ (నాటౌట్) 0, ఎక్స్‌ట్రాలు: 9, మొత్తం: 336/6. వికెట్ల పతనం: 1-9, 2-37, 3-158, 4-271, 5-308, 6-334, బౌలింగ్: సామ్ కరన్ 7-0-47-1, టాప్లే 8-0-50-2, టామ్ కరన్ 10-0-83-2, స్టోక్స్ 5- 0-42-0, అలీ 10-0-47-0, రషీద్ 10-0-65-1.
ఇంగ్లండ్: రాయ్ (రనౌట్) 55, బెయిర్‌స్టో (సి) కోహ్లీ (బి) కృష్ణ 124, స్టోక్స్ (సి) పంత్ (బి) భువనేశ్వర్ 99, మలన్ (నాటౌట్) 16, బట్లర్ (బి) కృష్ణ 0, లివింగ్‌స్టోన్ (నాటౌట్) 27, ఎక్స్‌ట్రాలు: 16, మొత్తం: 43.3 ఓవర్లలో 337/4. వికెట్ల పతనం: 1-110, 2-285, 3-287, 4-287, బౌలింగ్: భువనేశ్వర్ 10-0-63-1, కృష్ణ 10-0-58-2, శార్దూల్ 7.3-0-54-0, కుల్దీప్ 10-0-84-0, కృనాల్ 6-0-72-0.