బుధవారం 01 ఏప్రిల్ 2020
National - Feb 16, 2020 , 02:36:03

నలుగురు చిన్నారులు సజీవ దహనం

నలుగురు చిన్నారులు సజీవ దహనం
  • పంజాబ్‌లో పాఠశాల వ్యాను దగ్ధం
  • పిల్లలపాలిట మృత్యువుగా మారిన కాలంచెల్లిన స్కూల్‌ వ్యాను

ఛండీగఢ్‌, ఫిబ్రవరి 15: మొదటిరోజు పాఠశాలకు వెళ్తున్న ఆ చిన్నారికి అదే చివరిరోజు అయింది. డబ్బులకు కక్కుర్తిపడి కాలం చెల్లిన వ్యాన్‌ను కొనుగోలు చేసిన ఓ పాఠశాల నిర్లక్ష్యం నలుగురు పసిమొగ్గల్ని చిదిమేసింది. పంజాబ్‌లోని సంగ్రుర్‌ జిల్లాలో శనివారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. పాఠశాల విద్యార్థులు ప్రయాణిస్తున్న వ్యానులో మంటలు చెలరేగడంతో నలుగురు చిన్నారులు దుర్మరణం పాలయ్యారు. జిల్లాలోని లోంగోవాల్‌-సిడ్సమాచార్‌ రహదారిపై ఈ దారుణం చోటుచేసుకున్నది. లోంగోవాల్‌ గ్రామంలోని ఓ ప్రైవేట్‌ పాఠశాలకు చెందిన 12 మంది విద్యార్థులు పాఠశాల ముగిసిన అనంతరం స్కూల్‌ మినీ వ్యానులో ఇండ్లకు తిరిగి వస్తుండగా ప్రమాదవశాత్తు వ్యానులో మంటలు చెలరేగాయి.


ఈ హఠాత్పరిణామాన్ని అక్కడే పొలాల్లో పనిచేస్తున్న కొందరు కూలీలు గమనించి వ్యానులో నుంచి వెంటనే ఎనిమిది మంది పిల్లల్ని రక్షించారు. అయితే మరో నలుగురు పిల్లలు మంటలకు ఆహుతయ్యారు. మృతుల్లో మూడేండ్ల బాలిక కూడా ఉన్నట్టు పోలీసులు తెలిపారు. ఘటనపై పంజాబ్‌ సీఎం అమరీందర్‌ సింగ్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంపై న్యాయవిచారణకు ఆదేశించారు. ప్రమాదానికి కారణమైన వ్యానుకు ఎప్పుడో కాలం చెల్లిందని, ప్రస్తుతం కండిషన్‌లో లేదని ప్రాథమిక విచారణలో తేలినట్టు పోలీసులు తెలిపారు. ప్రమాదంలో కన్నుమూసిన మూడేండ్ల బాలిక పాఠశాలకు మొదటిసారిగా వచ్చిందని, మృతుల్లో ఇద్దరు ఒకే కుటుంబానికి చెందిన వాళ్లని సంగ్రుర్‌ ఎంపీ, ఆవ్‌ుఆద్మీ పార్టీ నాయకుడు భగవత్‌ మన్‌ తెలిపారు.


logo
>>>>>>