గురువారం 04 జూన్ 2020
National - May 12, 2020 , 01:18:06

24 గంటల్లో 4213 కేసులు

24 గంటల్లో 4213 కేసులు

  • 67వేలు దాటిన కరోనా బాధితుల సంఖ్య
  • 2,206కు చేరుకున్న మరణాలు

న్యూఢిల్లీ, మే 11: దేశవ్యాప్తంగా కరోనా రోజురోజుకు విజృంభిస్తున్నది. గడిచిన 24 గంటల్లో (ఆదివారం నుంచి సోమవారం నాటికి) రికార్డుస్థాయిలో 4,213 కేసులు నమోదయ్యాయి. దేశంలో కరోనా కేసులు నమోదైనప్పటి నుంచి కేవలం ఒక్కరోజులోనే ఇంత ఎక్కువస్థాయిలో కేసులు వెలుగుచూడటం ఇది రెండోసారి. ఈ నెల 7న 5,013 కేసులు నమోదైన విషయం తెలిసిందే. తాజా కేసులను కలుపుకొని మొత్తం కేసుల సంఖ్య 67,152కు చేరింది. అలాగే 24 గంటల వ్యవధిలో 97 మరణాలు సంభవించాయి. దీంతో మొత్తం మరణాల సంఖ్య 2,206కు పెరిగింది. వ్యాధి బారిన పడిన వారిలో ఇప్పటి వరకు 20,916 మంది కోలుకున్నారు. దీంతో రికవరీ రేటు 31.15 శాతంగా నమోదైంది. రాష్ర్టాలవారీగా అత్యధిక కేసులు, మరణాలు సంభవించిన జాబితాలో మహారాష్ట్ర తొలిస్థానంలో నిలిచింది. ఆ రాష్ట్రంలో ఇప్పటి వరకు 22,171 కేసులు నమోదవ్వగా, 832 మరణాలు సంభవించాయి. కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ మాట్లాడతూ కొన్ని ప్రాంతాల్లో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని చెప్పారు. ఆయా ప్రాంతాల్లో కేసులను నియంత్రించడానికి ప్రయత్నిస్తున్నామని, తద్వారా సమూహ వ్యాప్తి దశకు చేరుకోకుండా చూస్తున్నామని తెలిపారు.

తమిళనాడులో కొత్తగా 798 కేసులు! 

చెన్నై: తమిళనాడులో వరుసగా ఐదో రోజు 500కి పైగా కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ పేర్కొంది. కరోనా బారిన పడిన వారిలో ఆరుగురు సోమవారం మరణించగా, కొత్తగా 798 పాజిటివ్‌ కేసులు రికార్డయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 8,002కు చేరుకున్నది. ప్రస్తుతం 5,895 మంది దవాఖానల్లో చికిత్స పొందుతున్నారని, 2051 మందిని డిశ్చార్జీ చేశామని తెలిపింది.

గుజరాత్‌లో విజృంభణ 

గుజరాత్‌లో సోమవారం కొత్తగా 347 మందికి కరోనా సోకగా, 20 మంది మృతి చెందారు. రాష్ట్రవ్యాప్తంగా మృతుల సంఖ్య 513కు, కేసుల సంఖ్య 8,542కి పెరిగింది. అహ్మదాబాద్‌ జిల్లా పరిధిలో కరోనా వేగంగా విస్తరిస్తున్నది. మొత్తం మృతులలో 400 మంది ఈ జిల్లాకు చెందినవారే. 

17 రోజుల హోమ్‌ ఐసొలేషన్‌!

కరోనా లక్షణాలతో హోమ్‌ ఐసొలేషన్‌ (ఇంట్లో వేరుగా ఉండటం)లో ఉన్న రోగులు 17 రోజుల తర్వాత ఐసొలేషన్‌ నుంచి బయటకు రావొచ్చని కేంద్రం పేర్కొంది. ఈమేరకు మార్గదర్శకాలను సవరించింది. తేలికపాటి లక్షణాలు లేదా కరోనా అనుమానిత కేసులుగా గుర్తించిన వ్యక్తులు హోమ్‌ ఐసొలేషన్‌లోకి వెళ్లొచ్చని సూచించింది. ‘రోగిలో తేలికపాటి వైరస్‌ లక్షణాలు ఉన్నట్టు చికిత్సనందించే వైద్యాధికారి ధ్రువీకరించాలి. రోగికి గత 10 రోజులుగా జ్వరం లేకపోయినా, వైరస్‌ లక్షణాలు కనిపించకపోయినా.. 17 రోజుల తర్వాత ఐసొలేషన్‌ నుంచి బయటకు రావొచ్చు’ అని పేర్కొంది.   logo