శనివారం 15 ఆగస్టు 2020
Ashoka Developers
National - Jul 30, 2020 , 18:32:49

న్యూయార్క్ టైమ్ స్క్వేర్లో అయోధ్య భూమిపూజ ప్రసారాలు

న్యూయార్క్ టైమ్ స్క్వేర్లో అయోధ్య భూమిపూజ ప్రసారాలు

న్యూఢిల్లీ : అయోధ్యలోని ప్రతిపాదిత రామాలయం భూమిపూజన్ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు వీక్షించేలా రామాలయం తీర్థ క్షేత్ర ట్రస్ట్ అంతా సిద్ధం చేసింది. మరో ఆరు రోజుల్లో జరుగనున్న భూమిపూజన్ కార్యక్రమంతోపాటు ప్రతిపాదిత రామాలయం యొక్క 3 డీ చిత్రాలను న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్లోని భారీ బిల్ బోర్డులో ప్రసారం చేయనున్నారు.

హిందీ, ఇంగ్లిష్ లో 'జై శ్రీ రామ్' అనే పదాల చిత్రాలు, శ్రీరాముడి చిత్రాలు, వీడియోలు, ఆలయ రూపకల్పన, వాస్తుశిల్పం యొక్క 3 డీ పోర్ట్రెయిట్స్ తోపాటు ప్రధాని మోదీ ఆలయానికి పునాదిరాయి వేసే చిత్రాలను టైమ్స్ లోని బిల్ బోర్డులలో ప్రదర్శించనున్నారు. ఈ ప్రసారాలు ఆగస్టు 5 న ఉదయం 8 నుంచి రాత్రి 10 వరకు జరుగనున్నాయి.

ఆగస్టు 5 న న్యూయార్క్‌లో చారిత్రాత్మక క్షణాలను ఆనందంగా జరుపుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు అమెరికన్ ఇండియా పబ్లిక్ అఫైర్స్ కమిటీ అధ్యక్షుడు జగదీష్ సెవానీ  ధృవీకరించారు. ఈ భారీ నాస్డాక్ స్క్రీన్, 17,000 చదరపు అడుగుల ర్యాప్-చుట్టూ ఉన్న ఎల్ఈడీ డిస్ప్లే స్క్రీన్. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద నిరంతర బాహ్య ప్రదర్శనలలో ఒకటిగా పరిగణించబడుతున్నది. టైమ్స్ స్క్వేర్లో అత్యధిక రిజల్యూషన్ కలిగిన బాహ్య ఎల్ఈడీ స్క్రీన్ ఇదొక్కటే కావడం విశేషం.

అయోధ్య భూమిపూజన్ సమయంలో టైమ్స్ స్క్వేర్‌ వద్ద మిఠాయిలు పంచేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. "ఇది మానవజాతి జీవితంలో ఒకసారి వచ్చే సంఘటన. మేము దీనిని వేడుకగా చేయాల్సిన అవసరం ఉన్నది. ఐకానిక్ టైమ్స్ స్క్వేర్ లో 'రామ్ జన్మ భూమి శిలాన్యాసాలు' ఒక మధుర జ్ఞాపకం" అని జగదీష్ సెవానీ అన్నారు.


logo