ఆదివారం 05 జూలై 2020
National - Jun 29, 2020 , 19:22:05

తమిళనాడులో ఇవాళ 3,949 పాజిటివ్‌ కేసులు

తమిళనాడులో ఇవాళ 3,949 పాజిటివ్‌ కేసులు

చెన్నై : తమిళనాడులో కరోనా విజృంభిస్తున్నది. రోజు రోజుకు పాజిటివ్‌ కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్నది. సోమవారం ఒక్క రోజే 3,949 పాజిటివ్‌ కేసులు నమోదవగా ఒక్క చెన్నైలోనే 2,167 ఉన్నాయి. మొత్తం కేసులు 86,224కు చేరగా, ఇవాళ వైరస్‌ ప్రభావంతో 62 మంది చనిపోగా, మొత్తం మృతుల సంఖ్య 1141కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 37,331 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కాగా, రాష్ట్రంలో పూర్తిస్థాయిలో లాక్‌డౌన్‌ అమలు చేయాల్సిన అవసరం లేదని వైద్య నిపుణుల కమిటీ తమిళనాడు ముఖ్యమంత్రి  పళనిస్వామికి తెలియజేసింది. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎపిడెమియాలజీ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ ప్రదీప్ కౌర్ మాట్లాడుతూ తమిళనాడు ప్రభుత్వం పరిస్థితిని బట్టి ఆంక్షల విధింపు లేదా లాక్‌డౌన్‌పై నిర్ణయం తీసుకుంటుందని పేర్కొన్నారు. నిర్ణయం తీసుకునేటప్పుడు వివిధ రకాల ఎపిడెమియాలాజికల్ ఇండికేటర్లు, క్షేత్రస్థాయి పరిస్థితిని విశ్లేషించాలని నిపుణుల బృందం సిఫారసు చేసింది.

ఈ నెలాఖరుతో లాక్‌డౌన్‌ మార్గదర్శకాల గడువు ముగుస్తుండడంతో, తర్వాత అన్‌లాక్‌ 2.0పై ప్రభుత్వ ఉత్తర్వుల కోసం ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉండగా రాష్ట్రంలో మరో డీఎంకే ఎమ్మెల్యే కరోనా వైరస్‌ పాజిటివ్‌గా తేలింది. ఆదివారం జింజీకి చెందిన డీఎంకె ఎమ్మెల్యే కె.ఎస్.మస్తాన్‌ను పరీక్షించగా పాజిటివ్‌గా వచ్చింది. చికిత్స నిమిత్తం చెన్నైలోని క్రోమ్‌పేట్‌లోని డాక్టర్ రేలా మెడికల్ ఇనిస్టిట్యూట్‌లో చేర్పించారు. దీంతో వైరస్‌ పాజిటివ్‌గా పరీక్షించిన డీఎంకే ఎమ్మెల్యేల సంఖ్య నాలుగుకు చేరగా, తమిళనాడులో మహమ్మారి బారినపడ్డ మొత్తం ఎమ్మెల్యేల సంఖ్య ఐదుకు చేరింది.


logo