బుధవారం 12 ఆగస్టు 2020
National - Jul 03, 2020 , 16:12:47

కరోనాతో చనిపోయినవారి మృతదేహాల ఖననానికి 35 ఎకరాల భూమి

కరోనాతో చనిపోయినవారి మృతదేహాల ఖననానికి 35 ఎకరాల భూమి

బెంగళూరు: కరోనాతో చనిపోయినవారి మృతదేహాల ఖననానికి అధికారులు ఏకంగా 35 ఎకరాల భూమిని కేటాయించారు. కర్ణాటకలో కరోనా వల్ల మరణించిన వారి మృతదేహాలకు స్థానిక శ్మశానవాటికల్లో అంత్యక్రియలు నిర్వహించడంపై స్థానికుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. ఈ నేపథ్యంలో కొన్నిచోట్ల ఘర్షణలు కూడా చోటుచేసుకున్నాయి. మృతదేహాలు తరలించే సిబ్బంది, అంబులెన్స్ లపై స్థానికులు దాడులు చేస్తున్నారు. మరోవైపు కొన్ని సందర్భాల్లో కరోనా మృతదేహాలపట్ల సిబ్బంది సరిగా వ్యవహరించడం లేదన్న విమర్శలు వస్తున్నాయి.


ఇటీవల బళ్లారి దవాఖానలో కరోనాతో చనిపోయిన 8 మంది మృతదేహాలను ఒకే బ్యాగులో ఉంచిన సిబ్బంది వాటిని ఓ గోతిలోకి విసిరేశారు. ఆ రాష్ట్ర కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేయగా వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి బీ శ్రీరాములు ఈ అంశంపై స్పందించారు. కరోనాతో చనిపోయినవారి మృతదేహాల ఖననానికి ప్రత్యేక స్థలాన్ని కేటాయిస్తామని చెప్పారు. ఆ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ఆర్ అశోక్ తో ఈ విషయాన్ని చర్చించారు. ఉత్తర, దక్షిణ బెంగళూరు, అనెకల్, యలహంక తాలూకాల పరిధిలోని 9 గ్రామాల్లో సుమారు 35.5 ఎకరాలను కేటాయించాలని అధికారులను ఆదేశించారు. దీంతో బెంగళూరు అర్బన్ జిల్లా డిప్యూటీ కమిషనర్ జీఎన్ శివమూర్తి ఈ మేరకు స్థలం కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కరోనాతో చనిపోయినవారి మృతదేహాల ఖననానికి ఇంత పెద్ద స్థలం కేటాయించడం దేశలో ఇదే తొలిసారి కావడం విశేషం.




logo