న్యూఢిల్లీ: ఒక బాతు పిల్లకు సింహం సహాయం చేస్తున్న వీడియో వైరల్ అయ్యింది. ఈదేందుకు కష్టపడుతున్న ఒక బాతు పిల్లను పెద్ద సింహం గమనించింది. వెంటనే బాతు పిల్ల వద్దకు వచ్చిన ఆ సింహం తన కాళ్లతో దానిని నీటిలోకి నెట్టింది. ఈ సందర్భంగా తన కాలితో బాతు పిల్లను మెల్లగా సముదాయించింది.
ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత నంద గురువారం తన ట్విట్టర్లో ఈ వీడియోను పోస్ట్ చేశారు. ‘ఇంత పెద్ద మాంసాహార జంతువునకు సున్నితమైన హృదయం ఉందని మీలో ఎంత మందికి తెలుసు? అవి అడవి మృగాలే.. కానీ క్రూరమైనవి కాదు. ఆహారం కోసం, రెచ్చగొట్టినప్పుడు మాత్రమే అవి చంపుతాయి. వాటిని గౌరవించి ఆదరించండి’ అని అందులో పేర్కొన్నారు.
మరోవైపు ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. బాతు పిల్లను రక్షించేందుకు సింహం చేసిన ప్రయత్నాన్ని నెటిజన్లు కొనియాడారు. చిన్న ప్రాణి పట్ల అది చూపిన దయా గుణానికి పరవశించిపోయారు.