ఆదివారం 09 ఆగస్టు 2020
National - Jul 08, 2020 , 02:10:51

తిరువనంతపురం ఎయిర్‌పోర్టులో 30 కిలోల బంగారం పట్టివేత

తిరువనంతపురం ఎయిర్‌పోర్టులో 30 కిలోల బంగారం పట్టివేత

  • కేరళ సీఎం ఆఫీసుకు సెగలు ..  సీఎం కార్యదర్శిపై వేటు

తిరువనంతపురం: బంగారం అక్రమ రవాణా కేసు కేరళ ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో)లో ప్రకంపనలు పుట్టిస్తున్నది. ఈ నేపథ్యంలో సీఎం పినరాయి విజయన్‌కు కార్యదర్శిగా వ్యవహరిస్తున్న ఎం శివశంకర్‌పై వేటు పడింది. విదేశాల నుంచి ఓ కార్గోలో అక్రమంగా తరలిస్తున్న 30 కిలోల బంగారాన్ని గత శనివారం తిరువనంతపురం విమానాశ్రయంలో కస్టమ్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కేసును లోతుగా దర్యాప్తు చేయగా ఈ వ్యవహారంలో కేరళ ఐటీ శాఖలో పని చేస్తున్న మహిళా ఉద్యోగి స్వప్న సురేశ్‌తోపాటు తిరువనంతపురంలోని యూఏఈ కాన్సులేట్‌లో పనిచేస్తున్న మరో వ్యక్తి సరిత్‌ కుమార్‌ పాత్ర కూడా ఉన్నట్టు అధికారులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. కేసులో నిందితురాలిగా ఉన్న స్వప్న.. ఐటీ శాఖలో ఆరు నెలల ఒప్పందం ప్రాతిపదికన ఉద్యోగం చేస్తున్నట్టు తేల్చారు. ఈ క్రమంలోనే ఈ కేసులో శివశంకర్‌పై కూడా ఆరోపణలు వెళ్లువెత్తాయి. ఈ నేపథ్యంలో సీఎం కార్యాలయం మంగళవారం ఆయనను సీఎం కార్యదర్శి విధుల నుంచి తొలిగించింది. కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న స్వప్నను అరెస్టు చేశామని అధికారులు చెప్పారు. 


logo