శనివారం 28 నవంబర్ 2020
National - Nov 04, 2020 , 16:15:27

2050 నాటికి 30 భారతీయ నగరాల్లో నీటి కరవు

2050 నాటికి 30 భారతీయ నగరాల్లో నీటి కరవు

న్యూఢిల్లీ : మనం నీటిని ఎంతగా పొదుపు చేస్తామో.. అంతగా నీటిని ఉత్పత్తి చేసినట్లే అని గుర్తుంచుకోవాలి. రానున్న రోజుల్లో నీటి సమస్యపై అధ్యయనం చేసిన వరల్డ్‌ వైల్డ్‌ లైఫ్‌ ఫండ్‌ (డబ్ల్యూడబ్ల్యూఎఫ్‌) నీటి పొదుపుపై 30 భారతీయ నగరాలను హెచ్చరిస్తున్నది. ఇప్పటినుంచే నీటిని పొదుపు చేయనిపక్షంలో, భూగర్భజలాలను పెంచనిపక్షంలో.. రానున్న 30 ఏండ్లలో 30 నగరాలు నీటి కరవును ఎదుర్కోక తప్పదని తమ అధ్యయనంలో వెల్లడించింది.

2050 నాటికి భారతదేశంలోని 30 నగరాలు తీవ్రమైన నీటి ప్రమాదాలను ఎదుర్కొంటాయని ప్రపంచ వైల్డ్‌లైఫ్ ఫండ్ సర్వేలో తేలింది. అత్యవసర, నిర్మాణాత్మక చర్యలతో నీటి ప్రమాదాలను నివారించవచ్చని సూచించింది. రాబోయే 30 ఏండ్లలోపు 100 నగరాలు అతిపెద్ద నీటి నష్టాలను ఎదుర్కోవచ్చని డబ్ల్యూడబ్ల్యూఎఫ్‌ నిర్వహించిన వాటర్ రిస్క్ ఫిల్టర్ అనే సర్వే పేర్కొన్నది. రానున్న రోజుల్లో తీవ్ర ప్రమాదానికి అవకాశాలున్న 30 నగరాల జాబితాలో ఢిల్లీ, జైపూర్, ఇండోర్, అమృత్‌సర్, పుణే, శ్రీనగర్, కోల్‌కతా, బెంగళూరు, ముంబై, కోజికోడ్, విశాఖపట్నం, థానే, వడోదర, రాజ్‌కోట్‌, కోటా, నాసిక్‌, జబల్‌పూర్‌, హుబ్లీ-ధర్వాడ్‌, నాగ్‌పూర్‌, ధన్‌బాద్‌, భోపాల్‌, గ్వాలియర్‌, సూరత్‌, అలీగఢ్‌, లక్నో, కన్నూర్‌ ఉన్నాయి. జాబితాలో తొలిస్థానాల్లో లుథియానా, ఛండీగఢ్‌, అమృత్‌సర్‌, అహ్మదాబాద్‌ నగరాలు ఉన్నాయి. పట్టణ ప్రణాళిక, చిత్తడి నేల పరిరక్షణతో మంచినీటి వ్యవస్థ చెక్కుచెదరకుండా ఉండటానికి తీసుకోవలసిన కొన్ని చర్యలు అని అధ్యయనం తెలిపింది. నీటి సంరక్షణకు నిర్మాణాత్మక చర్యలు తీసుకోవలసిన అవసరం ఉన్నప్పటికీ, నీటి వినియోగాన్ని తగ్గించడం అనేది మరో అంశమని సూచించింది.

గత కొన్ని సంవత్సరాలుగా దేశంలోని అనేక నగరాలు నీటి సంక్షోభంతో బాధపడుతున్నాయి. మహారాష్ట్ర నుంచి తమిళనాడు వరకు.. భూగర్భజల పట్టిక క్షీణత, మౌలిక సదుపాయాల కొరత, వాతావరణ మార్పుల కారణంగా రాష్ట్రాలు తమ నీటి అవసరాలను తీర్చడానికి చాలా కష్టపడుతున్నాయి. "భారతదేశ పర్యావరణం యొక్క భవిష్యత్‌ దాని నగరాల్లోనే ఉన్నది. భారతదేశం వేగంగా పట్టణీకరణ చెందుతున్నప్పుడు.. అభివృద్ధి, స్థిరత్వంలో నగరాలు సాధారణంగా ముందంజలో ఉంటాయి'' అని డబ్ల్యూడబ్ల్యూఎఫ్ ఇండియా ప్రోగ్రాం డైరెక్టర్ సెజల్ వోరా పేర్కొన్నారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.