శనివారం 28 మార్చి 2020
National - Mar 16, 2020 , 07:21:26

తెలియని శత్రువుతో పోరాటం

తెలియని శత్రువుతో పోరాటం
  • ప్రపంచానికి ఆపద్బాంధవులుగా మారిన వైద్యసిబ్బంది
  • ప్రాణాలను పణంగా పెట్టి రోగులకు చికిత్స
  • వైరస్‌ బారిన పడి మరణిస్తున్నవారెందరో.. అయినా వెనుకడుగువేయని ైస్థెర్యం

నేషనల్‌ డెస్క్‌:తెలియని శత్రువుతో పోరాటం.. ప్రతి క్షణం భయం భయం.. అయినా తగ్గని ఆత్మైస్థెర్యం.. కుటుంబానికి దూరం.. పైగా పని ఒత్తిడి.. అయినా ఆత్మసంతృప్తి. ఇదీ కరోనా రోగులకు చికిత్స అందిస్తున్న వైద్య సిబ్బంది పరిస్థితి. వారు బాధితులకు చికిత్స అందించే క్రమంలో ప్రతిక్షణం కోట్ల వైరస్‌ కణాల మధ్య తిరుగుతున్నారు. అహర్నిశలు శ్రమిస్తూ.. తమ ప్రాణాలను పణంగా పెట్టి ప్రపంచానికి ఆపద్బాంధవులుగా నిలుస్తున్నారు. ఈ నేపథ్యంలో వారి జీవనశైలి ఆసక్తికరం...


రోగికన్నా ఎక్కువ బాధ

కరోనా సోకిన రోగులు ఎంత నరకాన్ని అనుభవిస్తున్నారో.. వారికి చికిత్స అందించే వైద్య సిబ్బంది అంతకన్నా ఎక్కువ బాధను అనుభవిస్తున్నారు. సిబ్బంది ఒక్కసారి ప్రొటెక్షన్‌ సూట్‌ వేసుకొని రంగంలోకి దిగితే ఇక తిండి ఎప్పుడు తింటారో.. డ్యూటీ ఎప్పుడు అయిపోతదో వాళ్లకే తెలియదు.  చికిత్స అందించే క్రమంలో పొరపాటున రోగి నుంచి వైరస్‌ సోకితే ఇక అంతే సంగతులు. సిబ్బంది ఇంటికి వెళ్లాక కుటుంబసభ్యులకూ వైరస్‌ అంటుకుంటుంది. కరోనా రోగులకు చికిత్స అందించే క్రమంలో కేవలం చైనాలోనే 3,387 మంది వైద్య సిబ్బందికి కరోనా వైరస్‌ సోకింది. పది మందికిపైగా చనిపోయారు.   

నీళ్లు తాగాలన్నా ఆరు గంటలు 

‘నాకు తెలియని శత్రువుతో పోరాడుతున్నా’.. ఇటలీకి చెందిన నర్సు పాగ్లియారిని అన్న ఈ మాట అక్షరాలా నిజం. ఏ యుద్ధంలోనైనా శత్రువు ఎవరో తెలుస్తుంది. కానీ కరోనా గుట్టు ఇప్పటివరకు వీడలేదు. ప్లాగియారిని 15 రోజులుగా ఇంటి ముఖం చూడలేదట. పనితో తీవ్రంగా అలసిపోయిన ఆమె.. కూర్చున్న చోటనే పడిపోయారు. ఆ ఫొటో నెటిజన్లను కదిలిస్తున్నది. కొన్ని చోట్ల వైద్య సిబ్బంది నీళ్లు తాగాలన్నా, టాయిలెట్‌కు వెళ్లాలన్నా ఆరు గంటలు వేచిచూడాల్సి వస్తున్నది. 


తీవ్రమైన పని ఒత్తిడి 

కరోనా రోగులకు వైద్యం అందించడమంటే కత్తిమీద సామువంటిది. చికిత్స అందించే క్రమంలో వైరస్‌ తమకు సోకకుండా వైద్య సిబ్బంది ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. ప్రత్యక్షంగా, పరోక్షంగా ఓడిపోతున్నారు. కొందరికి నేరుగా వైరస్‌ సోకుతుంటే.. మరికొందరు తీవ్ర పని ఒత్తిడికి గురవుతున్నారు. క్వారంటైన్‌ ప్రాంతాల్లో రోజులపాటు విధుల్లోనే ఉండాల్సి వస్తున్నది. దీంతో అనారోగ్యం బారినపడుతున్నారు.  కుటుంబానికి దూరంగా ఉండటంతో కుంగుబాటుకు గురవుతున్నారు.


పెండ్లిని వాయిదా వేసుకొని..

చైనాలో పెంగ్‌ వువ్వా అనే యువ డాక్టరు గత నెల 1న పెండ్లి చేసుకోవాలనుకున్నాడు. కరోనా విజృంభించడంతో రోగులకు వైద్యం అందించడానికి పెండ్లిని వాయిదా వేసుకున్నాడు. చికిత్స అందించే క్రమంలో అతడికి వైరస్‌ సోకింది. దీంతో అతడు గత నెల 21న మరణించాడు.


ఎంతో ఆత్మసంతృప్తి 

ఎన్ని అడ్డంకులున్నా వైద్యసిబ్బందిలో ఆవగింజంత అసంతృప్తి కనిపించడం లేదు. పైగా ప్రపంచాన్ని కాపాడుతున్నామన్న ఆత్మసంతృప్తి వారిలో కనిపిస్తున్నది. ‘యుద్ధమొస్తే సైనికులు రక్షిస్తారు. ఇలాంటి మహమ్మారులు విజృంభించినప్పుడు కాపాడటం మా ధర్మం’ అని సగర్వంగా చెప్తున్నారు. రోగి కోలుకొని ఇంటికెళ్తుంటే వారి మొహాల్లో వెలకట్టలేని ఆనందం కనిపిస్తున్నది. 


చైనాలో 78,800 మందికి కరోనా సోకితే అందులో వైద్యసిబ్బందే 3,300 మందికిపైగా ఉన్నారు. 


logo