ఆదివారం 07 జూన్ 2020
National - Apr 04, 2020 , 10:59:44

3000 కి.మీ.. 52 గంటలు.. సొంతూరికి గర్భిణి

3000 కి.మీ.. 52 గంటలు.. సొంతూరికి గర్భిణి

తిరువనంతపురం : దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమల్లో ఉండడంతో కొన్ని ప్రాంతాల్లో నిత్యావసర వస్తువులు దొరకడం లేదు. రోగులు, గర్భిణులతో పాటు ఇతర ఆరోగ్య సమస్యలున్న వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఓ గర్భిణి, ఆమె భర్త కలిసి 3 వేల కిలోమీటర్లు.. 52 గంటల పాటు అంబులెన్స్‌లో ప్రయాణించి తమ సొంతూరుకు చేరుకున్నారు. 

కేరళ అలప్పుజా జిల్లాలోని పల్లనాకు చెందిన విష్ణు, విరింద దంపతులు ఢిల్లీలోని ఓ కాల్‌ సెంటర్‌లో పని చేస్తున్నారు. విరింద నెల రోజుల గర్భిణి. లాక్‌డౌన్‌ అమలు చేయడంతో.. విరిందకు ఆహారం, మెడిసిన్స్‌ తీసుకురావడం ఇబ్బంది అయింది. విష్ణు బయటకు వెళ్లిన ప్రతీసారి పోలీసులు అడ్డుకోవడం జరుగుతుంది. సరైన ఆహారం, మెడిసిన్స్‌ లేకపోవడంతో గర్భిణి ఆరోగ్యం క్షీణిస్తోంది. దీంతో ఆమెకు పూర్తిగా బెడ్‌ రెస్ట్‌ కావాలని వైద్యులు చెప్పారు.

మరి సొంతూరుకు రావాలంటే ఎలా?

విరిందను సొంతూరుకు తీసుకురావాలని విష్ణు నిర్ణయించుకోవడంతో.. ఢిల్లీలోని ఆస్పత్రి సిబ్బంది కూడా సహకరించారు. అంబులెన్స్‌తో పాటు మెడికల్‌ సిబ్బందిని సమకూరుస్తామని ఆస్పత్రి యాజమాన్యం చెప్పారు. 3 వేల కిలోమీటర్ల ప్రయాణానికి రూ.1.2 లక్షలు ఖర్చు అవుతోంది. దీంతో విష్ణు తన తల్లిదండ్రులకు ఫోన్‌ చేసి జరిగిన విషయాన్ని చెప్పాడు. తండ్రేమో జాలరి, తల్లేమో నరేగా కూలీ. వారి వద్ద అంతగా డబ్బు లేదు. ఇక మొత్తానికి తల్లిదండ్రులు, తమ బంధువులు కొంత డబ్బు జమ చేసి విష్ణుకు పంపించారు. స్థానిక నాయకులు కూడా విష్ణుకు ఆర్థిక సాయం చేశారు. అలా వారిచ్చిన నగదుతో సొంతూరుకు బయల్దేరారు విష్ణు, విరింద దంపతులు. 

ఢిల్లీ నుంచి బాగానే వచ్చినప్పటికీ తమిళనాడు - కేరళ సరిహద్దులోని వలయార్‌ చెక్‌పోస్టు వద్ద ఆ అంబులెన్స్‌ను పోలీసులు ఆపారు. వెనక్కి వెళ్లాలని విష్ణును పోలీసులు హెచ్చరించారు. మొత్తానికి స్థానిక నాయకుల సహాయంతో విష్ణు, విరింద ఆ చెక్‌పోస్టును దాటి సొంతూరుకు చేరుకున్నారు. ఈ విపత్కర పరిస్థితుల్లో తనకు సాయం చేసిన ప్రతి ఒక్కరికి విష్ణు, విరింద ధన్యవాదాలు తెలిపారు.


logo