శుక్రవారం 27 నవంబర్ 2020
National - Nov 07, 2020 , 11:33:41

29 శాతం ఆహార వ‌స్తువులు నాసిరక‌మే!

29 శాతం ఆహార వ‌స్తువులు నాసిరక‌మే!

న్యూఢిల్లీ: దేశంలోని ఆహార వ‌స్తువుల్లో పావు వంతుకుపైగా నాసిరకంగా ఉన్నాయ‌ని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాంట‌ర్డ్స్ అథారిటీ (ఎఫ్ఎస్సెస్ఏఐ) ప‌రిశీల‌న‌లో తేలింది. దేశ‌వ్యాప్తంగా 1,06,459 ఆహార వ‌స్తువుల న‌మూనాల‌ను ప‌రీక్షించ‌గా అందులో 30,415 నాసిరకంగా ఉన్న‌ట్లు వెల్ల‌డైంది. ఈమేర‌కు 2018-19 కాలానికి సంబంధించిన‌ వార్షిక నివేదిక‌ను విడుద‌ల చేసింది. మొత్తం ప‌రిశీలించిన వ‌స్తువుల్లో 3,900 ప్ర‌మాద‌క‌రంగా ఉండ‌గా, 16,870 వ‌స్తువులు నాణ్య‌తా లోపాల‌తో, మ‌రో 9,645 న‌మూనాలు లేబిలింగ్‌, ఇత‌ర లోపాల‌తో ఉన్న‌ట్లు అందులో వెల్ల‌డించింది. దీంతో 2813 క్రిమిన‌ల్, 18,550 సివిల్ కేసులు న‌మోదుచేశామ‌ని పేర్కొంది. ఇందులో 701 మందికి శిక్ష‌లు ప‌డ‌గా, 12,734 మంది నుంచి జ‌రిమానాలు వ‌సూలు చేశామ‌ని వెల్ల‌డించింది. 

దేశంలో అత్య‌ధికంగా ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో 52 శాతం న‌మూనాలు నాసిరకంగా ఉన్నాయ‌ని తేలింది. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో 14 శాతం, తెలంగాణ‌లో 10 శాతం మేర ఇలాంటి వ‌స్తువులు ఉన్న‌ట్లు తెలిపింది. రాష్ట్రంలో 1,760 న‌మూనాల‌ను సేక‌రించ‌గా, 168 ప్ర‌మాణాలకు అనుగుణంగా లేవ‌ని వెల్ల‌డించింది. అందులో 23 ప్ర‌మాద‌క‌రంగా ఉన్నాయ‌ని, మ‌రో 86 నాణ్య‌త లేమి, 59 లేబిలింగ్‌, ఇత‌ర లోపాల‌తో ఉన్న‌ట్లు పేర్కొంది. దీనికి‌గాను 33 క్రిమిన‌ల్, 191 సివిల్ కేసులు న‌మోద‌చేశామ‌ని, ముగ్గురికి శిక్ష ప‌డింద‌ని తెలిపింది. 15 మంది నుంచి రూ.2.48 ల‌క్ష‌ల జ‌రిమానా వ‌సూలు చేశామ‌ని తెలిపింది.