గురువారం 02 ఏప్రిల్ 2020
National - Mar 06, 2020 , 03:05:46

కరోనా కట్టడికి చర్యలు

కరోనా కట్టడికి చర్యలు
  • దేశవ్యాప్తంగా 28,529 మంది అనుమానితులపై నిఘా
  • వైరస్‌ ప్రభావిత దేశస్థులకు వీసాలు రద్దు
  • అన్ని రాష్ర్టాల్లో ప్రత్యేక వైద్య బృందాల ఏర్పాటు
  • పార్లమెంట్‌లో కేంద్ర మంత్రి హర్షవర్ధన్‌ ప్రకటన
  • యూపీకి చెందిన వ్యక్తికి వైరస్‌.. 30కి పెరిగిన కేసులు

న్యూఢిల్లీ, మార్చి 5: కరోనా వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు కేంద్రం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నదని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్‌ తెలిపారు. నియంత్రణ చర్యల్లో భాగంగా 28,529 మంది అనుమానితులపై నిఘా పెట్టామన్నారు. ప్రస్తుత పరిస్థితులపై గురువారం ఆయన పార్లమెంట్‌లో ప్రకటన చేశారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల గురించి వివరించారు. ఈ నెల 4వ తేదీ నాటికి దేశవ్యాప్తంగా 29 మందికి వైరస్‌ సోకినట్టు నిర్ధారణ అయ్యిందన్నారు. వారందరి పరిస్థితి నిలకడగా ఉన్నదని చెప్పారు. వ్యాధి వ్యాప్తిని నియంత్రించేందుకు ఆరోగ్యశాఖతోపాటు ప్రభుత్వ శాఖలన్నీ సమిష్టిగా పనిచేస్తున్నాయన్నారు. పరిస్థితిపై ప్రధాని మోదీ స్వయం గా సమీక్షిస్తున్నారని తెలిపారు. వైరస్‌ ప్రభా వం అధికంగా ఉన్న ఇటలీ, ఇరాన్‌, దక్షిణ కొరియా, జపాన్‌వాసులకు ఈ నెల 3వ తేదీ వరకు జారీ చేసిన అన్ని వీసాలను రద్దు చేసినట్టు తెలిపారు. భారతీయులు చైనా, ఇరాన్‌, ద.కొరియా, ఇటలీ, జపాన్‌కు అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయవద్దని సూచనలు జారీ చేశామన్నారు. 


వారందరూ సురక్షితం

చైనా నుంచి భారత్‌కు తరలించిన వారెవరికీ వైరస్‌ సోకలేదని చెప్పారు. మొదటి విడుతలో తీసుకొచ్చిన 654 మందిని, రెండో విడుతలో తరలించిన 112 మందిని 14 రోజులపాటు పరీక్షించామని తెలిపారు. పరీక్షల్లో నెగిటివ్‌ రావడంతో వారిని ఇండ్లకు పంపించామని వెల్లడించారు. జపాన్‌లోని డైమండ్‌ ప్రిన్సెస్‌ నౌక నుంచి తరలించిన 124 మందికి కూడా వైరస్‌ సోకలేదని తేలిందన్నారు. వారిని ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉంచామని, వారి ఆరోగ్యం నిలకడగా ఉన్నదన్నారు. 


మరో కరోనా కేసు నమోదు

ఉత్తరప్రదేశ్‌లోని గజియాబాద్‌కు చెందిన ఒక వ్యక్తికి వైరస్‌ సోకినట్టు నిర్ధారించారు. అతడు ఇటీవలే ఇరాన్‌ నుంచి వచ్చినట్టు గుర్తించారు. దీంతో బాధితుల సంఖ్య 30కి చేరింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరికొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది. అన్ని రాష్ర్టాలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు తక్షణ ప్రతిస్పందన బృందాలను ఏర్పాటుచేయాలని స్పష్టం చేసింది. ఇటలీ, దక్షిణ కొరియా తదితర కరోనా ప్రభావిత దేశాల నుంచి భారత్‌కు వచ్చేవారు ముందుగా వైద్య పరీక్షలు చేయించుకొని బయలుదేరాలని ఆదేశించింది. కొవిడ్‌-19 సోకలేదని అక్కడి వైద్య నిపుణులు ఇచ్చే నివేదికను కచ్చితంగా వెంట తెచ్చుకోవాలని చెప్పింది. ఆ పత్రాలను పరిశీలించిన తర్వాతే వారిని భారత్‌లోకి అనుమతిస్తామని స్పష్టం చేసింది. 

ఈ నిబంధన ఈ నెల 10వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందని తెలిపింది. విదేశాల నుంచి తిరిగి వచ్చేవారు తమ పూర్తి వివరాలతో దరఖాస్తు నింపాలని ఆదేశించింది. మరోవైపు వైరస్‌ సోకిన 14 మంది ఇటలీ యాత్రికులను ఐటీబీపీ క్యాంప్‌ నుంచి గుర్గావ్‌లోని మేదాంత హాస్పిటల్‌కు తరలించి, చికిత్స అందిస్తున్నారు. మరో వ్యాధిగ్రస్థుడు, పేటీఎం సంస్థ ఉద్యోగి.. ఇటీవల 91 మందిని కలిసినట్టు అధికారులు గుర్తించారు. వారిలో ఐదుగురిని దవాఖానకు తరలించి వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. మిగతావారి కోసం వెతుకుతున్నారు.


logo