ఆదివారం 05 జూలై 2020
National - May 28, 2020 , 15:47:25

కసబ్‌ను గుర్తించిన పెద్దాయన కన్నుమూత

కసబ్‌ను గుర్తించిన పెద్దాయన కన్నుమూత

ముంబై: 12 ఏండ్ల క్రితం ముంబైపై దాడి చేసిన పాకిస్థాన్‌ ప్రేరేపిత ఉగ్రవాది అజ్మల్‌ కసబ్‌ను గుర్తించిన పెద్ద మనిషి హరిశ్చంద్ర శ్రీవార్ధంకర్‌ గురువారం కన్నుమూశారు. 26/11 దాడి కేసులో హరిశ్చంద్ర ప్రధాన సాక్షిగా ఉన్నారు. గత కొన్నాళ్లుగా అరోగ్య సమస్యలతో బాధపడుతూ ఇటీవలనే కొలుకొన్నారని, అంతలోనే హఠాత్తుగా గుండెపోటుతో చనిపోయారని అయన పెద్దకుమారుడు చెప్పారు. ప్రస్తుతం వీరు ముంబైలోని కళ్యాణ్‌ ప్రాంతంలోని యోగిధాంలో నివసిస్తున్నారు.

2008 నవంబర్‌ 26న పది మంది ఉగ్రవాదులు సముద్ర మార్గం గుండా ముంబై చేరుకొని విచ్చలవిడిగా కాల్పులు జరిపారు. ఈ కాల్పులను దగ్గర నుంచి చూడటమే కాకుండా రెండు బుల్లెట్ గాయాలకు గురయ్యాడు. ఈ కాల్పులకు ప్రధాన కారకుడైన అజ్మల్‌ కసబ్‌ను చూసి గుర్తుపట్టారు. ఈ కేసులో ప్రదాన సాక్షిగా కూడా ఉన్నారు. ఇలాఉండగా, ఈ నెల ఒకటో తేదీన ఫుట్‌పాత్‌పై పడిపోయి ఉండటాన్ని గుమనించిన స్థానికులు ఆయనను దగ్గర్లోని దవాఖానకు తరలించారు. అప్పటి నుంచి ఆయన పలు ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. హరిశ్చంద్రకు భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. హరిశ్చంద్ర ఆర్థిక పరిస్థితి తెలుసుకొన్న అప్పటి ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌.. ఆయన కుటుంబానికి బీజేపీ నుంచి రూ.10 లక్షల ఆర్థిక సాయం అందజేశారు.


logo