శనివారం 11 జూలై 2020
National - Jun 25, 2020 , 19:25:19

పాకిస్తాన్‌ నుంచి భారత్‌ వచ్చిన 250 మంది

పాకిస్తాన్‌ నుంచి భారత్‌ వచ్చిన 250 మంది

అమృత్‌సర్‌ : కరోనా వైరస్ సంక్రమణతో లాక్‌డౌన్‌ అమలు కారణంగా దేశ, విదేశాల్లో ప్రతిచోటా ప్రజలు చిక్కుకున్నారు. లా‌క్‌డౌన్‌ ఎత్తివేయడంతో వ్యక్తులు తమ ఇళ్లకు తిరిగి వస్తున్నారు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్‌కు చెందిన 250 మంది భారతీయ పౌరులు గురువారం స్వదేశానికి తిరిగొచ్చారు. ఈ ప్రజలు అట్టారి-వాఘా సరిహద్దు మీదుగా భారత్‌ చేరుకున్నారు. రానున్న రెండు రోజుల్లో 498 మంది భారతీయులు పాకిస్తాన్ నుంచి అంతర్జాతీయ రహదారుల ద్వారా తిరిగి రానున్నారు.

ప్రస్తుతానికి పాకిస్తాన్ నుంచి స్వదేశానికి తిరిగి వచ్చిన ప్రజలు అంతా జమ్ముకశ్మీర్‌కు చెందినవారుగా గుర్తించారు. భారత్‌ చేరుకొన్నవెంటనే వీరంతా తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు. చాలా మంది కన్నీళ్లు పెట్టుకొన్నారు. వీరిని తీసుకెళ్లేందుకు జమ్ము కశ్మీర్ నుంచి ప్రత్యేక బస్సులు అమృత్‌సర్‌ చేరుకున్నాయి. ఇమ్మిగ్రేషన్‌కు ముందు థర్మల్ స్కాన్ చేసిన అనంతరం వీరంతా బస్సుల్లో ఎక్కి జమ్ముకు బయల్దేరారు.

పాకిస్తాన్ నుండి వస్తున్న భారతీయ పౌరుల ఆరోగ్య విషయాలను తెలుసుకొనేందుకు అటారీ-వాఘా సరిహద్దు వద్ద వైద్య బృందాలను నియమించారు. ప్రయాణికులందరినీ ఇక్కడ పరిశీలించిన తరువాత వారిని వారివారి స్వగ్రామాలకు పంపించివేశారు. వీరు హోం క్వారంటైన్‌లో 14 రోజులు తమ ఇళ్లలో ఉండాల్సి ఉంటుంది. పాకిస్తాన్ నుంచి తొలి బ్యాచ్ భారతీయ పౌరులు వచ్చారని స్థానిక ఎస్‌డీఎం శివరాజ్ సింగ్ తెలిపారు. వీరందరూ జమ్ము కశ్మీర్ నివాసితులని, వైద్య పరీక్షల తర్వాత వారిని గమ్యస్థానానికి పంపినట్లు చెప్పారు.

లా‌క్‌డౌన్‌ కారణంగా భారత్-పాకిస్తాన్ మధ్య రహదారిని మూసివేశారు. దాంతో జమ్ముకశ్మీర్, గుజరాత్, మహారాష్ట్ర, ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్, పంజాబ్, ఢిల్లీ, మధ్యప్రదేశ్, హర్యానా సహా ఇతర రాష్ట్రాల నుంచి 746 మంది అక్కడ చిక్కుకున్నారు. వీరంతా తమ బంధువులను చూసేందుకు, మరికొందరు మతపరమైన సందర్శన కోసం పాకిస్తాన్ వెళ్లారు. అయితే, వీరిలో 250 మంది తిరిగి రాగా, మిగిలిన వారు కూడా మరో రెండు రోజుల్లో వచ్చేందుకు ఏర్పాట్లు పూర్తిచేశారు.

కరోనా వైరస్ వ్యాప్తి చెందిన తరువాత భారత్‌, పాకిస్తాన్ ప్రభుత్వాలు ఇండో-పాక్ సరిహద్దును మూసివేశాయి. పాకిస్తాన్‌లో చిక్కుకున్న భారతీయ ప్రజలు గురించి సమాచారం అందుకున్న తరువాత, భారత పౌరులను రోడ్డు మార్గంలో పంపించడానికి ప్రత్యేక అనుమతి ఇవ్వాలని భారత ప్రభుత్వం.. పాకిస్తాన్ ప్రభుత్వాన్ని కోరింది. దీని తరువాత, తమ దేశంలో చిక్కుకున్న భారతీయ పౌరులను వాఘా-అట్టారి సరిహద్దు మీదుగా భారత్‌ పంపించడానికి పాకిస్తాన్ ప్రభుత్వం అనుమతించింది.


logo