శుక్రవారం 05 జూన్ 2020
National - May 17, 2020 , 02:23:11

చితికిన బతుకులు

చితికిన బతుకులు

 • యూపీ రోడ్డు ప్రమాదంలో 25 మంది, ఎంపీలో 8మంది వలస కూలీలు దుర్మరణం
 • మొత్తం నాలుగు ప్రమాదాల్లో 69 మందికి గాయాలు.. 
 • సొంతూళ్లకు వెళ్తుండగా దుర్ఘటనలు   
 • రూ.2 లక్షలు నష్టపరిహారం ప్రకటించిన యూపీ సర్కార్‌

ఔరియా (యూపీ), సాగర్‌ (మధ్యప్రదేశ్‌), లక్నో, న్యూఢిల్లీ, మే 15: నాలుగు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో మొత్తం 33 మంది వలస కార్మికులు మరణించారు. 69 మంది గాయపడ్డారు. ఈ ఘటనలు ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకున్నాయి. లాక్‌డౌన్‌ కారణంగా ఉపాధి కోల్పోయిన వలస కార్మికులు తమ స్వస్థలాలకు తిరిగి వెళ్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే 22 మంది వలస కార్మికులు ఓ ట్రక్కులో ఢిల్లీ నుంచి మధ్యప్రదేశ్‌కు బయలుదేరారు. వీరి వాహనం శనివారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఔరియా- కాన్పూర్‌ దేహత్‌ రోడ్డు వద్దకు చేరుకున్నాక చాయ్‌ తాగడానికి డ్రైవర్‌ ఆపాడు. ఇదే సమయంలో రాజస్థాన్‌ నుంచి 43 మంది వలస కార్మికులతో వస్తున్న మరో ట్రక్కు (గోధుమ పిండి లోడ్‌తో ఉన్నది).. ఆగి ఉన్న ట్రక్కును బలంగా ఢీకొట్టింది. దీంతో రెండు వాహనాలు బోల్తాపడి పక్కనే ఉన్న మురుగుకాల్వలో పడిపోయాయి. అయితే ఎక్కువ మంది ప్రయాణికులు పిండి బస్తాలపై కూర్చోని ప్రయాణిస్తుండటంతో బోల్తాపడినప్పుడు ఆ బస్తాలు వారి మీద పడి కొందరు చనిపోయారు. తీవ్రంగా గాయపడిన వారిని దవాఖానకు తరలిస్తుండగా మరికొందరు ప్రాణాలు కోల్పోయారు. ఇలా 25 మంది మరణించారు. 40 మంది గాయపడ్డారు. వెంటనే స్పందించిన అధికార యంత్రాగం సహాయక చర్యలు చేపట్టింది. గాయపడిన వారిని సమీప దవాఖానలకు తరలించింది. మరణించిన వారిలో ఎక్కువ మంది జార్ఖండ్‌, పశ్చిమబెంగాల్‌, ఉత్తరప్రదేశ్‌కు చెందినవారు ఉన్నారు.

మధ్యప్రదేశ్‌లోనే మూడు ప్రమాదాలు

మధ్యప్రదేశ్‌లో జరిగిన మూడు వరుస ప్రమాదాల్లో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. 29 మంది గాయపడ్డారు. ఓ లారీలో మహారాష్ట్ర నుంచి ఉత్తరప్రదేశ్‌కు వెళ్తున్న వలస కార్మికుల్లో ఆరుగురు మరణించగా.. 18 మంది గాయపడ్డారు. ఈ దుర్ఘటన శనివారం మధ్యప్రదేశ్‌లోని సాగర్‌ జిల్లాలో చోటుచేసుకుంది. లాక్‌డౌన్‌ కారణంగా ఎలాగైనా తమ స్వస్థలాలకు వెళ్లాలని అనుకున్న ఈ వలస కార్మికులు వస్ర్తాలను తీసుకెళ్తున్న ఓ లారీలో ఎక్కారు. వస్ర్తాల కట్టలపై (బండిల్స్‌) కూర్చొని ప్రయాణిస్తున్నారు. అయితే ఈ లారీ సాగర్‌-కాన్పూర్‌ రోడ్డు వద్దకు చేరుకునే సమయంలో ఒక్కసారిగా అదుపు తప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో ఆరుగురు కార్మికులు మరణించారు. వీరిలో నలుగురు మహిళలు ఉన్నారు. గుణ జిల్లాలో జరిగిన మరో ప్రమాదంలో ఓ వ్యక్తి మరణించారు. బర్వానీ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ఉత్తరప్రదేశ్‌ రోడ్డు ప్రమాదంపై రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, ప్రధాని, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కాంగ్రెస్‌ నేతలు రాహుల్‌గాంధీ, ప్రియాంకాగాంధీ, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌, ఉత్తరప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్‌, బీఎస్పీ అధినేత్రి మాయావతి, ఎస్పీ నేత అఖిలేష్‌ యాదవ్‌ తీవ్ర సంతాపం తెలిపారు.

లాక్‌డౌన్‌ నేపథ్యంలో ప్రమాదాలు!


 • లాక్‌డౌన్‌ నేపథ్యంలో మార్చి 25 నుంచి ఈనెల 16 వరకు దేశవ్యాప్తంగా సుమారు 2,000 రోడ్డు ప్రమాదాలు జరుగగా, 368 మంది ప్రాణాలు కోల్పోయారు. 
 • లక్నో-ఆగ్రా ఎక్స్‌ప్రెస్‌ వేపై ఓ వాహనం ఢీ కొట్టడంతో ఈ నెల 16న బీహార్‌ నుంచి హర్యానాకు ఆటోలో వెళుతున్న వలస కార్మిక దంపతుల  మృతి.
 • మధ్యప్రదేశ్‌లోని గుణ పరిధిలో గురు, శుక్రవారాల్లో జరిగిన రెండు ప్రమాదాల్లో 14 మంది మృత్యువాత.
 • శుక్రవారం ఉత్తరప్రదేశ్‌ వ్యాప్తంగా వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. 
 • గురువారం ఢిల్లీ-సహరాన్‌పూర్‌ జాతీయ రహదారిపై బస్సు ఢీకొనడంతో ఆరుగురి మరణం. 
 • మే8న మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో రైల్వే ట్రాక్‌పై నిదురిస్తున్న కూలీల మీదుగా గూడ్సు రైలు దూసుకెళ్లడంతో 16 మంది దుర్మరణం. 
 • మార్చి 28 తెల్లవారుజామున మహారాష్ట్ర-గుజరాత్‌ సరిహద్దుల్లో ట్రక్‌ ఢీకొనడంతో నలుగురి మృతి.
 • మార్చి 30న కారు ఢీకొనడంతో మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ఓ కార్మికుడి మరణం. 


logo