బుధవారం 30 సెప్టెంబర్ 2020
National - Aug 04, 2020 , 22:42:13

అస్సాంకు 24 గంట‌ల దూర‌ద‌ర్శ‌న్ చాన‌ల్ ‌

 అస్సాంకు 24 గంట‌ల దూర‌ద‌ర్శ‌న్ చాన‌ల్ ‌

ఢిల్లీ: కేంద్ర స‌మాచార ప్ర‌సార శాఖ మంత్రి ప్ర‌కాశ్ జ‌వ‌దేక‌ర్, అస్సాం రాష్ట్రానికి ప్ర‌త్యేకంగా 24 గంట‌ల దూర‌ద‌ర్శ‌న్ చాన‌ల్‌‌ను ఈరోజు న్యూఢిల్లీ నుంచి వీడియో కాన్ఫ‌రెన్సు ద్వారా ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ , “ ఈ చాన‌ల్ అస్సాం  ప్ర‌జ‌ల‌కు ఒక  బ‌హుమ‌తి. ఈ చాన‌ల్ అస్సాంలోని అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల అవ‌స‌రాల‌ను తీరుస్తుంది.  బహుళ ప్ర‌చారం పొందుతుంది” అని ఆయ‌న అన్నారు. అన్ని రాష్ట్రాలు స్వంతంగా దూర‌ద‌ర్శన్ చాన‌ళ్లు క‌లిగి ఉండడం ముఖ్య‌మ‌ని ఆయ‌న అన్నారు. ఇత‌ర రాష్ట్రాల చాన‌ళ్ళు డిడి ఫ్రీ డిష్ లో అందుబాటులో ఉన్నాయ‌న్నారు. దూర‌ద‌ర్శ‌న్ ఆరు జాతీయ చాన‌ళ్ల‌లో వ‌చ్చే కార్య‌క్ర‌మాల‌ను మంత్రి కొనియాడారు.

ఈశాన్య ప్రాంతాన్ని భార‌త‌దేశ అభివృద్ధి ఇంజిన్‌గా మార్చాల‌న్న ప్ర‌ధానమంత్రి న‌రేంద్ర మోదీ దార్శ‌నిక‌త‌ను ఆయ‌న పున‌రుద్ఘాటించారు. ఈ ప్రాంతాంలొ  పుష్క‌లంగా స‌హ‌జ వ‌న‌రులు, మాన‌వ వ‌న‌రులు ఉన్నాయ‌ని, అనుసంధాన‌త క్ర‌మంగా పెరుగుతున్న‌ద‌ని ఆయ‌న అన్నారు. ప్ర‌స్తుత ప్ర‌భుత్వం, ఈశాన్య రాష్ట్రాల‌పై ఇంత‌కు ముందెన్న‌డూ లేని విధంగా దృష్టిపెట్ట‌డంలో భాగమే  అస్సాంలో దూర‌ద‌ర్శ‌న్ చాన‌ల్ అని ఆయ‌న అన్నారు. అస్సాం ముఖ్య‌మంత్రి శ‌ర్వానంద్ సోనోవాల్, అస్సాం నుంచి ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు.

ఈరోజు అస్సాం ప్ర‌జ‌ల‌కు ఎంతో ముఖ్య‌మైన రోజు అని ఆయ‌న అన్నారు. “ఈ చాన‌ల్  అస్సాం ప్ర‌గ‌తిని అన్నిరంగాలలో మ‌రింత ముందుకు తీసుకువెళుతుంది, అలాగే ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మాలు, తీసుకుంటున్న చ‌ర్య‌ల‌ను అట్ట‌డుగు స్థాయి వ‌ర‌కు ఇది తీసుకువెళ్ల‌గ‌ల‌దు” అని అన్నారు. ప్ర‌ధానమంత్రి న‌రేంద్ర మోదీ కృషిని శ్రీ సోనోవాల్ ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు.“ ప్ర‌ధాన‌మంత్రి  న‌రేంద్ర మోదీ మొద‌టి రోజు నుంచీ ఈశాన్య రాష్ట్రాల‌కు గ‌ల శ‌క్తి సామ‌ర్ధ్యాలు, అవ‌కాశాల విష‌యంపై దృష్టి పెడుతూ చిత్త‌శుద్ధితో కృషి చేస్తున్నా”ర‌ని  అన్నారు.

తాజావార్తలు


logo