శుక్రవారం 05 జూన్ 2020
National - May 12, 2020 , 14:40:44

ధారవిని తలపిస్తున్న కన్నాగి నగర్‌.. 23 కరోనా కేసులు నమోదు

ధారవిని తలపిస్తున్న కన్నాగి నగర్‌.. 23 కరోనా కేసులు నమోదు

చెన్నై : కరోనా వైరస్‌తో తమిళనాడు అతలాకుతలమవుతోంది. ఇప్పటికే 8 వేలకు పైగా కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, ఆ రాష్ట్ర ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. కరోనా విలయతాండవానికి తమిళనాడు కుదేలవుతోంది. చెన్నైలోని కోయంబేడు మార్కెట్‌లో చాపకింద నీరులా విస్తరించిన కరోనా వైరస్‌.. తాజాగా స్లమ్‌ ఏరియా అయిన కన్నాగి నగర్‌కు వ్యాపించింది. కన్నాగి నగర్‌ ప్రస్తుతం మరో ధారవిని తలపిస్తోంది. కన్నాగి నగర్‌తో పాటు ఆ పరిసర ప్రాంతాల్లో సుమారు 30 వేలకు పైగా నివాసాలు ఉన్నాయి. ఈ ఏరియాలో ఒకే రోజు 23 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కావడంతో.. ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అధికారులు కూడా అప్రమత్తమై కరోనా నివారణ చర్యలు తీసుకుంటున్నారు. 

తమిళనాడులో ఇప్పటి వరకు 8,002 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 2,051 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ఇక 53 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. కేవలం చెన్నైలోనే 4,371 కేసులు నమోదు అయ్యాయి. సోమవారం ఒక్కరోజే చైన్నైలో 538 పాజిటివ్‌ కేసులు నమోదు కావడంతో.. స్థానికులు వణికిపోతున్నారు. 

కోయంబేడు మార్కెట్‌ కరోనా వైరస్‌ హాట్‌స్పాట్‌గా మారింది. ఈ మార్కెట్‌లో 527 మందికి కరోనా సోకింది. దీంతో కోయంబేడు మార్కెట్‌ను పోలీసులు మూసివేశారు. కోయంబేడు మార్కెట్‌లో 200లకు పైగా హోల్‌సేల్‌ కూరగాయల దుకాణాలు, 1000 వరకు రిటైల్‌ దుకాణాలు ఉన్నాయి. సాధారణ రోజున ఈ మార్కెట్‌కు సుమారు 7 వేల మంది దాకా వస్తారని అధికారులు తెలిపారు. 

ధారవిలో 29 మంది మృతి

ముంబయిలోని ధారవిలో సోమవారం వరకు కరోనాతో 29 మంది ప్రాణాలు కోల్పోయినట్లు బృహణ్‌ ముంబయి మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారులు వెల్లడించారు. ఈ స్లమ్‌ ఏరియాలో కొత్తగా 57 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. దేశంలోనే కరోనా పాజిటివ్‌ కేసుల్లో మహారాష్ట్ర అగ్రస్థానంలో నిలిచింది. మహారాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 23,401 కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఈ వైరస్‌ నుంచి 4,786 మంది కోలుకుని డిశ్చార్జి కాగా, 868 మంది ప్రాణాలు కోల్పోయారు.


logo