మంగళవారం 26 జనవరి 2021
National - Dec 28, 2020 , 15:14:58

21 ఏండ్ల‌కే మేయ‌ర్‌గా యువ‌తి ప్ర‌మాణ‌స్వీకారం

21 ఏండ్ల‌కే మేయ‌ర్‌గా యువ‌తి ప్ర‌మాణ‌స్వీకారం

తిరువ‌నంత‌పురం: కేర‌ళ రాజ‌ధాని తిరువ‌నంత‌పురం న‌గ‌ర కార్పోరేష‌న్ ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించి 21 ఏండ్లకే ఆ ఘ‌న‌త‌ సాధించిన  యువ‌తిగా రికార్డు నెల‌కొల్పిన ఆర్యా రాజేంద్ర‌న్ ఈ ఉద‌యం మేయ‌ర్ ప్ర‌మాణ‌స్వీకారం చేసి మ‌రో రికార్డు సృష్టించారు. అతిచిన్న వ‌య‌సులో కార్పొరేట‌ర్‌గా గెలువ‌డంతోపాటే న‌గ‌ర మేయ‌ర్ ప‌ద‌విని కూడా ఆమె ద‌క్కించుకున్నారు. మ‌రో ముఖ్య విష‌యం ఏమిటంటే ఆర్య రాజేంద్ర‌న్ త‌న‌కు ఓటు హ‌క్కు వ‌చ్చిన త‌ర్వాత తొలిసారి తిరువ‌నంత‌పురం కార్పోరేష‌న్ ఎన్నిక‌ల్లోనే ఓటువేశారు. అదే ఎన్నిక‌ల్లో ప్ర‌జాప్ర‌తినిధిగా కూడా గెలిచి, మేయ‌ర్ పీఠం అధిష్ఠించారు. 

తిరువనంతపురంలోని అల్‌ సెయింట్స్‌ కాలేజీలో బీఎస్సీ మ్యాథమెటిక్స్‌ సెకండియర్‌ చదువుతున్న ఆర్య రాజేంద్ర‌న్‌.. ఇటీవ‌ల జ‌రిగిన తిరువ‌నంత‌పురం కార్పోరేష‌న్ ఎన్నిక‌ల్లో ముద‌వ‌న‌ముఘ‌ల్ డివిజ‌న్ నుంచి సీపీఐఎం త‌ర‌ఫున బ‌రిలో నిలిచి 2,872 ఓట్లు సాధించారు. త‌న స‌మీప ప్ర‌త్య‌ర్థి అయిన కాంగ్రెస్ అభ్య‌ర్థిపై 549 ఓట్ల ఆధిక్యం సాధించారు. ఈ ఎన్నిక‌ల్లో అధికార ఎల్‌డీఎఫ్ కూట‌మి 100 డివిజ‌న్‌ల‌కుగాను 53 డివిజ‌న్‌ల‌లో విజ‌యం సాధించి మ‌రోసారి మేయ‌ర్ ప‌ద‌విని నిల‌బెట్టుకుంది. 

ఇక‌, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూట‌మి రెండో స్థానంలో నిలువ‌గా, కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కూట‌మి మూడో స్థానానికి ప‌రిమిత‌మైంది. అయితే, ఎల్‌డీఎఫ్ కూట‌మి నుంచి మేయర్ ప‌ద‌వికి పోటీదారులుగా బరిలో దిగిన ఇద్దరు సీపీఎం నేతలు ఈ ఎన్నిక‌ల్లో ప‌రాజ‌యం పాల‌య్యారు. దాంతో స్థానిక నేత‌లు ఆర్య రాజేంద్రన్‌ పేరును తెరపైకి తెచ్చారు. అందుకు పార్టీ అగ్ర నాయ‌కత్వం కూడా అంగీక‌రించ‌డంతో ఆమెను తిరువ‌నంత‌పురం త‌దుప‌రి మేయ‌ర్‌గా ఎన్నుకోవ‌డంతో ఈ ఉద‌యం ప్ర‌మాణ‌స్వీకారం చేసి ప‌ద‌విని చేప‌ట్టారు.   

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo