సోమవారం 08 మార్చి 2021
National - Jan 26, 2021 , 01:43:09

రైతన్నకు సెల్యూట్‌

రైతన్నకు సెల్యూట్‌

  • అన్నదాతల వల్లనే దేశం సుభిక్షం
  • దేశ రక్షణలో జవాన్ల అసమాన శౌర్యం
  • జాతి యావత్తూ వీరికి సలాం చేస్తున్నది
  • గణతంత్ర దిన సందేశంలో రాష్ట్రపతి కోవింద్‌

కరోనా సంక్షోభ సమయంలోనూ మన రైతులు ఆహారధాన్యాలు, పాల ఉత్పత్తుల విషయంలో దేశాన్ని స్వయంసమృద్ధంగా నిలిపారు. ఈ గొప్ప దేశం రైతులకు సలాం చేస్తున్నది. సరిహద్దుల్లో రాజ్య విస్తరణవాదులను నిలువరించటంలో మన సైనికులు చూపిన ధైర్యసాహసాలు అసాధారణం.

న్యూఢిల్లీ, జనవరి 25: ఆహార ధాన్యాల ఉత్పత్తిలో దేశాన్ని స్వయం సమృద్ధం చేసిన ఘనత అన్నదాతదేనని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ అన్నారు. భారీ జనాభా ఉన్న భారతదేశం ఆకలి తీర్చుతున్నది రైతన్నలేనని కొనియాడారు. దేశ రక్షణంలో మన వీరజవాన్లు ప్రాణాలకు తెగించి శౌర్య పరాక్రమాలు ప్రదర్శిస్తున్నారని ప్రశంసించారు. 72వ గణతంత్ర వేడుకలను పురస్కరించుకొని రాష్ట్రపతి సోమవారం దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తూ రైతులు, జవాన్లకు సలాం చేశారు.  వివిధ రంగాల్లో సంస్కరణలు అమలుచేస్తున్నప్పుడు ప్రారంభంలో కొన్ని అపార్థాలు ఏర్పడటం సహజమని వ్యవసాయ చట్టాలపై వివాదాన్ని ఉద్దేశించి రాష్ట్రపతి అన్నారు.

‘సంస్కరణల పథంలో మొదట కొన్ని అపార్థాలు వస్తూ ఉంటాయి. కానీ రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉన్నది. కరోనా సంక్షోభ సమయంలోనూ మన రైతులు ఆహారధాన్యాలు, పాల ఉత్పత్తుల విషయంలో దేశాన్ని స్వయంసమృద్ధంగా నిలిపారు. ఈ గొప్ప దేశం రైతులకు సలాం చేస్తున్నది’ అన్నారు. సరిహద్దుల్లో రాజ్య విస్తరణవాదులను నిలువరించటంలో మన సైనికులు చూపిన ధైర్యసాహసాలు అసాధారణమని పేర్కొన్నారు. గతేడాది లఢక్‌లోని గల్వాన్‌లో చైనా సైన్యంతో పోరాడుతూ అమరులైన కర్నల్‌ సంతోష్‌బాబు సహా 20మంది సైనికులకు రాష్ట్రపతి నివాళులర్పించారు. దురాక్రమణవాదులను ఎదుర్కోవటంలో సైన్యం, నౌకాదళం, వాయుసేన సమైక్యంగా పనిచేశాయని ప్రశంసించారు. కరోనాను జయించేందుకు టీకాలు వేసుకోవాలని ప్రజలకు సూచించారు. దేశ ప్రజలకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

VIDEOS

logo