శనివారం 27 ఫిబ్రవరి 2021
National - Jan 22, 2021 , 20:12:44

అలాగైతే ప్ర‌జాస్వామ్యానికి తీర‌నిముప్పు: ‌బాంబే హైకోర్టు సంచ‌ల‌నం

అలాగైతే ప్ర‌జాస్వామ్యానికి తీర‌నిముప్పు: ‌బాంబే హైకోర్టు సంచ‌ల‌నం

ముంబై: న‌్యాయ‌వ్య‌వ‌స్థ‌తోపాటు సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ) వంటి ద‌ర్యాప్తు సంస్థ‌లు, భార‌తీయ రిజ‌ర్వు బ్యాంక్ వంటి నియంత్ర‌ణ సంస్థ‌లు స్వ‌తంత్రంగా వ్య‌వ‌హ‌రించ‌క‌పోతే ప్ర‌జాస్వామ్యానికి చాలా హాని క‌లుగుతుంద‌ని బాంబే హైకోర్టు గురువారం సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. భూ ఆక్ర‌మ‌ణ ఆరోప‌ణ‌ల‌పై అభియోగాలు ఎదుర్కొంటున్న నేష‌న‌లిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) నేత ఏక్‌నాథ్ ఖ‌డ్సేకు వ్య‌తిరేకంగా చ‌ర్య‌లు తీసుకోకుండా తాత్కాలిక ర‌క్ష‌ణ క‌ల్పించ‌డంపై జ‌రిగిన వాద‌, ప్ర‌తివాద‌న‌ల సంద‌ర్భంగా న్యాయ‌స్థానం ఈ వ్యాఖ్య‌లు చేసింది.

2016లో అప్ప‌టి రెవెన్యూ మంత్రిగా ఏక్‌నాథ్ ఖ‌డ్సే భూ ఆక్ర‌మ‌ణ‌కు పాల్ప‌డిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్నారు. దీనిపై త‌న‌కు తాత్కాలిక ర‌క్ష‌ణ క‌ల్పించాల‌ని దాఖ‌లైన పిటిష‌న్‌ను జ‌స్టిస్‌లు ఎస్ఎస్ షిండే, మ‌నీష్ పిటాలే సార‌థ్యంలోని ధ‌ర్మాస‌నం విచారించింది. ఈడీ కేసును కొట్టివేయాల‌ని కూడా ఖ‌డ్సే కోరారు. ఈ సంద‌ర్భంగా ఖ‌డ్సేపై సోమ‌వారం వ‌ర‌కు ఎటువంటి చ‌ర్య‌లు తీసుకోబోమ‌ని ఈడీ త‌ర‌ఫు న్యాయ‌వాది అనిల్ సింగ్ న్యాయ‌స్థానం ద్రుష్టికి తెచ్చారు.

దీనిపై ధ‌ర్మాస‌నం తీవ్రంగా స్పందించింది. పిటిష‌న‌ర్‌కు మ‌రి కొన్ని రోజులు తాత్కాలిక ర‌క్ష‌ణ క‌ల్పిస్తే స్వ‌ర్గాలు కూలిపోతాయా? అని ఘాటుగా ప్ర‌శ్నించింది. ఆర్బీఐ, సీబీఐ, ఈడీ వంటి నియంత్ర‌ణ సంస్థ‌లు స్వ‌తంత్రంగా, నిష్ప‌క్ష‌పాతంగా వ్య‌వ‌హ‌రిస్తాయ‌ని తాము ఎల్ల‌వేళ‌లా న‌మ్ముతామ‌ని పేర్కొంది. ఈ సంస్థ‌లు స్వ‌తంత్రంగా స్పందించ‌కుంటే ప్ర‌జాస్వామ్యానికి తీవ్ర ముప్పు అని ఆందోళ‌న వ్య‌క్తం చేసింది. 

గ‌తేడాది అక్టోబ‌ర్‌లో బీజేపీని వీడి ఎన్సీపీలో చేరిన ఖ‌డ్సేను భూ ఆక్ర‌మ‌ణ కేసులో ఈ నెల 15వ తేదీన ముంబైలోని త‌మ కార్యాల‌యంలో విచార‌ణ‌కు హాజ‌రు కావాల‌ని ఈడీ ఆదేశించింది. దీనికి అనుగుణంగానే ద‌ర్యాప్తుకు ఖ‌డ్సే స‌హ‌క‌రిస్తూ, విచార‌ణ‌లో పాల్గొంటున్న‌ప్పుడు అరెస్ట్ చేయాల్సిన అవ‌స‌రం ఏమిట‌ని జ‌స్టిస్ షిండే ప్ర‌శ్నించారు. ఒక‌వేళ ఎవ‌రైన స‌హ‌క‌రించ‌క‌పోతే మేం అర్థం చేసుకోగ‌ల‌మ‌ని కూడా చెప్పారు. అయితే, త‌న అల్లుడి నుంచి త‌న భార్య చ‌ట్ట‌బ‌ద్ధంగా భూమి కొనుగోలు చేశార‌ని, ఇందులో చ‌ట్ట విరుద్ధ‌మేమీ లేద‌ని ఖాడ్సే వాదించారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo