సోమవారం 18 జనవరి 2021
National - Jan 14, 2021 , 18:37:32

పైవాళ్ల‌తో మాట్లాడుకోండి: యెడియూర‌ప్ప

పైవాళ్ల‌తో మాట్లాడుకోండి: యెడియూర‌ప్ప

బెంగ‌ళూరు: క‌ర్ణాట‌క సీఎం బీఎస్ యెడియూర‌ప్ప మూడో మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌పైనే సొంత పార్టీ ఎమ్మెల్యేలు స‌హా ప‌లువురు నేత‌లు మండిప‌డుతున్నారు. ఆయ‌న మ‌ద్ద‌తుదారులకు మంత్రి ప‌ద‌వులు క‌ట్టిపెట్ట‌డానికి క్యాబినెట్‌ను విస్త‌రించార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. సొంత పార్టీ ఎమ్మెల్యేల‌కు యెడియూర‌ప్ప కూడా దీటుగానే స‌మాధాన‌మించ్చారు. త‌న ప‌నితీరు న‌చ్చ‌ని వారు పార్టీ జాతీయ నేత‌ల‌కు ఫిర్యాదు చేసుకోవ‌చ్చున‌ని స‌వాల్ చేశారు. 

బీజేపీ ఎమ్మెల్యేల‌కు అభ్యంత‌రాలు ఉంటే వారు ఢిల్లీకి వెళ్లి బీజేపీ జాతీయ నేత‌ల‌ను క‌లిసి వారివ‌ద్ద ఉన్న స‌మాచారం ఇచ్చి, ఫిర్యాదు చేసుకోవ‌చ్చున‌ని గురువారం బెంగ‌ళూరులో మీడియాతో అన్నారు. పార్టీ జాతీయ నేత‌ల‌కు వారు చేసే ఫిర్యాదుల‌పై తాను అభ్యంత‌రం వ్య‌క్తం చేయ‌బోన‌న్నారు. కానీ పార్టీ ప్ర‌తిష్ఠ‌ను దెబ్బ‌తీసే విధంగా మాట్లాడ‌వ‌ద్ద‌ని కోరారు. త‌న‌పై పార్టీ ఎమ్మెల్యేలు, నేత‌లు చేసే ఫిర్యాదులపై బీజేపీ కేంద్ర నాయ‌కులు ఓ నిర్ణ‌యానికి వ‌స్తార‌న్నారు. 

17 నెల‌ల బీజేపీ ప్ర‌భుత్వంలో త‌న‌ను బ్లాక్ మెయిల్ చేసిన వారికి, అత్యంత సన్నిహితులుగా ఉన్న వారికి మాత్ర‌మే యెడియూర‌ప్ప క్యాబినెట్ ప‌ద‌వులు ఇచ్చార‌ని కొంద‌రు బీజేపీ నేత‌లు బ‌హిరంగంగానే ఆరోప‌ణ‌లు గుప్పించారు. బీజేపీ సీనియ‌ర్ నేత బ‌స‌న్న‌గౌడ ఆర్ పాటిల్ మాట్లాడుతూ సీడీతోబ్లాక్‌మెయిల్ చేసిన వారిని, భారీ మొత్తంలో డ‌బ్బు చెల్లించిన వారిని క్యాబినెట్‌లోకి తీసుకున్నార‌ని ఆరోపించారు. సీడీల‌తో బ్లాక్ మెయిల్ చేసిన వారిలో ఇద్ద‌రికి క్యాబినెట్ ప‌ద‌వులు, మ‌రొక‌రికి సీఎం కార్య‌ద‌ర్శి ప‌ద‌వి క‌ల్పించార‌న్నారు.

విధేయ‌త‌, కులం, సీనియార్టీ, ప్రాంతాన్ని ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోకుండా, సీడీతో బ్లాక్ మెయిల్ చేసిన వారికే మంత్రి ప‌ద‌వులు ద‌క్కాయ‌ని చెప్పారు. మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌ను వ్య‌తిరేకిస్తున్న అస‌మ్మ‌తివాదుల్లో హెచ్ విశ్వ‌నాథ్‌, ఎంపీ కుమార‌స్వామి, స‌తీశ్ రెడ్డి, శివ‌న్న‌గౌడ నాయ‌క్‌, తిప్పారెడ్డిల‌తోపాటు యెడియూర‌ప్ప అత్యంత స‌న్నిహితులు ఎంపీ రేణుకాచార్య కూడా ఉన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.