ఆదివారం 24 జనవరి 2021
National - Dec 03, 2020 , 11:53:59

దూసుకువస్తున్న ‘బురేవి’

దూసుకువస్తున్న ‘బురేవి’

చెన్నై : నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర తుఫానుగా మారి చెన్నై, కేరళ వైపు దూసుకు వస్తోంది. తుఫాను తమిళనాడులోని పంబన్‌-కన్యాకుమారి మధ్య గురువారం రాత్రి నుంచి శుక్రవారం తెల్లవారు జాము తీరం దాటే అవకాశం ఉందని భారత వాతావరణశాఖ తెలిపింది. శుక్రవారం తుఫాను కేరళ తీరాన్ని తాకుతుందని చెప్పింది. తుఫాను తీరం దాటే సమయంలో 70-80 కిలోమీటర్ల వేగంతో గాలులు వస్తాయని, భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. గురువారం నుంచి శనివారం మధ్య కేరళలోని ఏడు జిల్లాలో పెనుగాలులతో కూడిన భారీ వర్షాలు పడుతాయని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో బురేవి తుఫానును ఎదుర్కొనేందుకు తమిళనాడు, కేరళ ప్రభుత్వాలు తుఫానును ఎదుర్కొనేందుకు చర్యలు చేపట్టాయి. కేరళ ప్రభుత్వం ఇప్పటికే 2,849 సహాయక శిబిరాలను ఏర్పాటు చేసింది. తమిళనాడు ప్రభుత్వం సైతం సహాయక శిబిరాలను ఏర్పాటు చేసింది. అలాగే రెండు రాష్ట్రాలు చేపల వేటపై నిషేధం విధించాయి. వేటకు వెళ్లిన వారంతా తిరిగి తీరానికి చేరుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.


మరో వైపు సహాయక చర్యలు చేపట్టేందుకు రెండు రాష్ట్రాల పరిధిలో 26 ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలను ఆయా తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో మోహరించారు. తుఫాను నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా తమిళనాడు, కేరళ సీఎంలు పళనిస్వామి, పినరయి విజయన్‌తో మాట్లాడారు. కేంద్రం తరఫున అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఇదిలా ఉండగా.. గురువారం ఉదయం రామేశ్వరం వద్ద సముద్రంలో అలలు భారీగా పెరిగాయి. అలాగే బురేవి తుఫాను ప్రభావంతో తమిళనాడులోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. విరుదునగర్‌లో బుధవారం రాత్రి నుంచి మోస్తరు వర్షాపాతం నమోదైంది. అరుప్పుకోట్టై, శివకాసి, కోవిలంకుళం, తిరుచులి, వెంబకోట్టై, సత్తూరు, రాజపాలయం, శ్రీవిల్లిపుత్తూర్, వాట్రాప్, పిలావక్కల్‌లో వానలు కురిశాయి. తుఫాను నేపథ్యంలో జిల్లా పర్యవేక్షణ అధికారి మధుమిత బుధవారం జలాశయాలను సందర్శించి, నీటిమట్టంపై ఆరా తీశారు. తుఫానును ఎదుర్కొనేందుకు సహాయక చర్యలు చేపట్టినట్లు తెలిపారు.


logo