మంగళవారం 01 డిసెంబర్ 2020
National - Nov 20, 2020 , 17:33:50

క‌రోనాకు ఓటు వేయండి..!

క‌రోనాకు ఓటు వేయండి..!

తిరువ‌నంత‌పురం: క‌రోనా పేరు వింటేనే జ‌నం భ‌యంతో హ‌డ‌లెత్తుతున్నారు. కానీ కేర‌ళ‌లో మాత్రం ఓ బీజేపీ అభ్య‌ర్థి క‌రోనాకు ఓటు వేయండి అంటూ ప్రచారం చేస్తుండ‌టం విశేషం. అక్క‌డి కొల్ల‌మ్ కార్పొరేష‌న్‌కు జ‌రుగుతున్న స్థానిక ఎన్నిక‌ల్లో మాథిలిల్ అనే వార్డుకు వెళ్తే.. క‌రోనాకు ఓటు వేయ‌మంటున్న ఆ మ‌హిళా అభ్య‌ర్థిని చూడొచ్చు. ఇంత‌కీ ఆమె ఇలా క‌రోనాకు ఓటు వేయండి అని ఎందుకు అడుగుతున్నారో తెలుసా? ఆమె పేరు క‌రోనా థామ‌స్ మ‌రి. క‌రోనే నేప‌థ్యంలో మాస్కు, గ్లోవ్స్ వేసుకొని ప్ర‌చారానికి వెళ్తున్న ఈ క‌రోనా.. ప్ర‌జ‌లకు శానిటైజ‌ర్లు ఇస్తూ ఓటు అడుగుతుండ‌టం విశేషం. 

కొవిడ్ వ‌చ్చిన మొద‌ట్లో త‌న పేరు త‌న‌కు కాస్త ఇబ్బంది క‌లిగించినా.. ఇప్పుడు మాత్రం ఎన్నిక‌ల ప్ర‌చారంలో బాగా ప‌నికొస్తున్న‌ట్లు 24 ఏళ్ల ఈ మ‌హిళా అభ్య‌ర్థి చెబుతోంది. నా పేరు వ‌ల్ల అంద‌రూ ఈజీగా గుర్తు పెట్టుకుంటున్నారు. ఇది ఎన్నిక‌ల్లో బాగా క‌లిసొస్తుంద‌ని ఆమె ఆశాభావం వ్య‌క్తం చేస్తోంది. త‌న‌కు, త‌న సోద‌రుడికి వెరైటీ పేర్లు పెట్టాల‌న్న త‌న తండ్రి థామ‌స్ ఫ్రాన్సిస్ నిర్ణ‌యం త‌నకు ఇవాళ ఇలా క‌లిసి వ‌స్తోంద‌ని క‌రోనా చెబుతోంది. ఆమె సోద‌రుడి పేరు కోర‌ల్‌. ఈ క‌రోనా త‌ర‌ఫున కోర‌ల్ థామ‌స్ కూడా ఫేస్‌బుక్‌లో ప్ర‌చారం చేస్తున్నాడు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా గో క‌రోనా, కిల్ క‌రోనా నినాదాల‌ను త‌న‌కు చాలా ఇబ్బంది క‌లిగించాయ‌ని ఆమె అంటోంది. ప్రెగ్నెంట్ అయిన క‌రోనా.. ఈ మ‌ధ్యే వైర‌స్ బారిన కూడా ప‌డ‌టం మ‌రో విశేషం.