బుధవారం 02 డిసెంబర్ 2020
National - Nov 11, 2020 , 11:39:13

ఇది ప్ర‌ధాని మోదీ విజ‌యం: చిరాగ్ పాశ్వాన్‌

ఇది ప్ర‌ధాని మోదీ విజ‌యం: చిరాగ్ పాశ్వాన్‌

న్యూఢిల్లీ: బీహార్ ఎన్నిక‌ల్లో బీజేపీ గెలుపొంద‌డంపై లోక్ జ‌న‌శ‌క్తి పార్టీ (ఎల్జేపీ) అధినేత చిరాగ్ పాశ్వాన్ ప్ర‌ధాని మోదీని పొగ‌డ్త‌లో ముంచెత్తారు. ఇది మోదీ విజ‌య‌మ‌ని ప్ర‌క‌టించారు. ఎన్నిక‌ల్లో ఆపార్టీ అనుకున్న‌దానికంటే ఎక్కువ సీట్లు గెలుచుకోవ‌డం మోదీ చ‌ల‌వేన‌ని అన్నారు. ఆయ‌న‌పై ప్ర‌జ‌ల‌కున్న న‌మ్మ‌కానికి ఈ ఫ‌లితాలు నిద‌ర్శ‌న‌మ‌ని చెప్పారు. త‌మ పార్టీ ఎన్నిక‌ల్లో ఆశించిన‌మేర‌కు రాణించింద‌ని తెలిపారు. త‌మ‌కు గ‌తంలోకంటే ఓట్ల శాతం పెరిగింద‌ని చెప్పారు. ఎల్జేపీ అభ్య‌ర్థులు ఎవ‌రి మ‌ద్ద‌తూ లేన‌ప్ప‌టికీ ఎన్నిక‌ల్లో బాగానే పోరాడార‌ని వెల్ల‌డించారు. బీహార్ ఫ‌స్ట్‌, బీహారీ ఫ‌స్ట్ నినాదంతో పోటీచేసిన తాము రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో బ‌ల‌ప‌డ్డామ‌ని చెప్పారు. దీన్నే రాబోయేకాలంలో కూడా కొన‌సాగిస్తామ‌న్నారు.  అతిపెద్ద‌పార్టీగా ఆర్జేడీ.. అయినా అధికారం బీజేపీదే!    

మూడు విడుత‌ల్లో జ‌రిగిన బీహార్ ఎన్నిక‌ల్లో ఎల్జేపీ సొంతంగా 150 స్థానాల్లో పోటీచేసింది. అయితే ఒకే ఒక స్థానంలో మాత్ర‌మే విజ‌యం సాధించింది. సీఎం నితీశ్ కుమార్‌తో వైరుధ్యాల కార‌ణంగా ఆపార్టీ ఎన్నిక‌ల ముందు ఎన్డీయే నుంచి బ‌య‌ట‌కు వెళ్లింది. జేడీయూ పోటీచేసిన అన్ని స్థానాల్లో ఎల్‌జేపీ త‌న అభ్య‌ర్థుల‌ను బ‌రిలో నిలిపింది. అయితే ఆశించిన స్థాయిలో రాణించ‌లేదు. అయిన‌ప్ప‌టికీ భారీగా ఓట్ల‌ను చీల్చ‌డంతో జేడీయూని 43 స్థానాల‌కే ప‌రిమిత‌మయ్యేలా చేసింది. ఈ ఎన్నిక‌ల్లో బీజేపీ 74 స్థానాల్లో గెలుపొందింది. మొత్తంగా ఎన్డీయే 125 సీట్లు కైవ‌సం చేసుకుని మ‌రోమారు అధికారం చేప‌ట్ట‌నుంది. కాగా, ప్ర‌చారంలో భాగంగా ప్ర‌ధాని మోదీని చిరాగ్ పాశ్వాన్ పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తారు. ప్ర‌ధానికి తాను హ‌నుమంతుడిలాంటివాడిన‌ని ప్ర‌క‌టించుకున్నారు.