బుధవారం 28 అక్టోబర్ 2020
National - Sep 29, 2020 , 02:04:49

త్రి శక్తి సంపన్నం

త్రి శక్తి సంపన్నం

న్యూఢిల్లీ:  విస్తరణ కాంక్షతో సరిహద్దుల్లో ఉద్రిక్తతలకు కారణమైన చైనాకు బుద్ధి చెప్పేందుకు భారత్‌ తన అస్త్ర శస్ర్తాలను సిద్ధం చేస్తున్నది. యుద్ధం అనివార్యమైన సందర్భంలో దీటుగా స్పందించేందుకు అత్యంత శక్తిమంతమైన మూడు క్షిపణులను రంగంలోకి దించనున్నది. ఇప్పటికే టిబెట్‌, జిన్‌జియాంగ్‌ వంటి కీలకమైన సరిహద్దు ప్రాంతాల్లో చైనాకు చెందిన పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ (పీఎల్‌ఏ) పెద్దమొత్తంలో సైన్యాన్ని, ఆయుధాలను,  యుద్ధ ట్యాంకులను మోహరించింది. ఈ నేపథ్యంలో భారత సైన్యం కూడా దూకుడును పెంచింది. ఇందులో భాగంగా అత్యాధునికమైన బ్రహ్మోస్‌, నిర్భయ్‌, ఆకాశ్‌ క్షిపణులను సిద్ధం చేసింది.  

క్షిపణి పేరు: ఆకాశ్‌

రకం: భూతలం నుంచి గగనతలం లక్ష్యాల ఛేదన

పరిధి: 40 కిలోమీటర్లు

విశేషాలు: దీనిలో ఉన్న ప్రత్యేకమైన రాడార్‌ ఒకే సమయంలో 64 లక్ష్యాలను గుర్తించగలదు. ఇదే సమయంలో 12 లక్ష్యాలకు గురి పెట్టగలదు. యుద్ధ విమానాలు, క్రూయిజ్‌, బాలిస్టిక్‌ క్షిపణులను ఛేదించగలదు. 

క్షిపణి పేరు: బ్రహ్మోస్‌

రకం: గగనతలం నుంచి గగనతలం 

లక్ష్యాలు.. గగనతలం నుంచి భూతలం లక్ష్యాల ఛేదన

పరిధి: 500 కిలోమీటర్లు

విశేషాలు: సుఖోయ్‌-30ఎంకేఐ వంటి యుద్ధ విమానాల నుంచి ప్రయోగానికి అనుకూలం, 300 కిలోగ్రాముల ఆయుధాన్ని మోసుకెళ్లగలదు.

క్షిపణి పేరు: నిర్భయ్‌

రకం: భూతలం నుంచి భూతలం లక్ష్యాల ఛేదన

పరిధి: 1000 కిలోమీటర్లు

విశేషాలు: యుద్ధ నౌకల పైనుంచి ప్రయోగించడానికి అనుకూలం. శత్రువుల రాడర్లకు దొరక్కుండా ఉండేందుకు భూమి నుంచి 100 మీటర్లు - 4 కిలోమీటర్ల ఎత్తులో ప్రయాణించగలదు. 

‘ఆత్మనిర్భర్‌ భారత్‌' నినాదంలో భాగంగా రక్షణ రంగ ఉత్పత్తుల్లో స్వదేశీ సంస్థలకే ప్రాధాన్యతనిస్తాం. తద్వారా భారత్‌ను ప్రపంచ తయారీ హబ్‌గా మారుస్తాం. ఇందుకు రక్షణ సముపార్జనకు సంబంధించిన కొత్త విధానం సాయపడనున్నది. కొనుగోలు ప్రతిపాదనలు కూడా వేగవంతమవుతాయి’  -రాజ్‌నాథ్‌ సింగ్‌, రక్షణ మంత్రి (రక్షణ ఉత్పత్తుల సేకరణకు సోమవారం కొత్త విధానాన్ని ఆవిష్కరించిన సందర్భంగా..)

రూ.2,290 కోట్లతో ఆయుధ సామాగ్రి కొనుగోలు

రూ.2,290 కోట్లతో అత్యాధునిక ఆయుధ సంపత్తిని భారత సైన్యం సమకూర్చుకోనున్నది. వీటిలో అమెరికా నుంచి 72,000 సిగ్‌ సాయెర్‌ అసాల్ట్‌ రైఫిల్స్‌ను కొనుగోలు చేయనున్నారు. ఈ మేరకు  భారత ఆర్మీకి రక్షణశాఖ సోమవారం అనుమతులనిచ్చింది.   రూ. 780 కోట్ల విలువైన ఈ రైఫిల్స్‌ను కొనుగోలు చేయడం ఇది రెండోసారి. 


logo