ఆదివారం 09 ఆగస్టు 2020
National - Jul 27, 2020 , 21:06:07

అయోధ్య భూమిపూజ‌కు మాజీ సీజేఐని ఆహ్వానించాలి : అధిర్ రంజ‌న్ చౌద‌రి

అయోధ్య భూమిపూజ‌కు మాజీ సీజేఐని ఆహ్వానించాలి : అధిర్ రంజ‌న్ చౌద‌రి

న్యూఢిల్లీ : ఆగ‌స్టు 5న రాజ‌కీయ నాయ‌కులు, వివిధ ప్ర‌ముఖ‌ల స‌మ‌క్షంలో అయోధ్య‌లో జ‌రుగ‌నున్న శ్రీ‌రామ మందిరం భూమిపూజ కార్య‌క్ర‌మానికి సుప్రీం కోర్టు మాజీ సీజేఐ రంజ‌న్ గొగోయ్‌ని ఆహ్వానించాల‌ని కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజ‌న్ చౌద‌రి డిమాండ్ చేశారు. 2019, నవంబర్ 9న మాజీ సీజేఐ నేతృత్వంలోని ఐదుగురు న్యాయ‌మూర్తుల ధ‌ర్మాస‌నం దీర్ఘ‌కాలంగా పెండింగ్‌లో ఉన్న అయోధ్య వివాదం కేసులో తీర్పునిచ్చింది. భూమిపూజ కార్య‌క్ర‌మానికి ఆయ‌న‌ను ఆహ్వానించ‌క‌పోవ‌డం అన్యాయ‌మ‌న్నారు. రామ మందిరం నిర్మాణం కోసం భూమిపూజ జ‌రుగుతుండ‌డం సామాన్య ప్ర‌జ‌లు ఆనందంగా ఉన్నారని, ఆహ్వానాలు ఇవ్వ‌డం చాలా క‌ష్ట‌మ‌ని, కార్యక్రమానికి పారిశ్రామికవేత్తలు, అధికార పార్టీ నాయకులు వ‌స్తార‌న్నార‌న్నారు.

వేడుక‌కు మాజీ సీజేఐని ఆహ్వానించ‌డం ముఖ్య‌మ‌ని, భూమిపూజ నిర్వాహ‌కులు కార్య‌క్ర‌మానికి ఆయ‌న‌ను పిల‌వాల‌ని కోరారు. కాగా, రంజ‌న్ గొగోయ్ ప్ర‌స్తుతం రాజ్య‌స‌భ స‌భ్యుడిగా కొన‌సాగుతున్నారు. ఆయ‌న‌ను ఎగువ స‌భ‌కు రాష్ట్రప‌తి రామ్‌నాథ్ కోవింద్ నామినేట్ చేశారు. దీనిపై పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. గొగోయ్ 2018 అక్టోబర్ 3 నుంచి 2019 నవంబర్ 17 వరకు సుప్రీం కోర్టు 46వ ప్రధాన న్యాయమూర్తిగా పని చేశారు. ఆగ‌స్టు 5న అయోధ్యలో రామ ఆల‌యానికి భూమిపూజ చేయ‌నుండ‌గా, పెద్ద ఎత్తున నిర్వాహ‌కులు ఏర్పాట్లు చేస్తున్నారు.


logo