శనివారం 08 ఆగస్టు 2020
National - Jul 27, 2020 , 17:39:00

కేంద్ర‌పాలిత ప్రాంతంగా ఉన్నంత వ‌ర‌కు ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌ను: ఒమ‌ర్ అబ్దుల్లా

కేంద్ర‌పాలిత ప్రాంతంగా ఉన్నంత వ‌ర‌కు ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌ను: ఒమ‌ర్ అబ్దుల్లా

శ్రీన‌గ‌ర్: ‌జ‌మ్ముక‌శ్మీర్ కేంద్ర‌పాలిత ప్రాంతంగా ఉన్నంత వ‌ర‌కు అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌న‌ని నేష‌‌న‌ల్ కాన్ఫ‌రెన్స్ నేత ఒమ‌ర్ అబ్దుల్లా తెలిపారు. "ఈ భూమి మీద అత్యంత అధికారం కలిగిన అసెంబ్లీలో సభ్యుడిగా ఉన్నాను. ఆరేండ్ల పాటు అసెంబ్లీ నాయ‌కుడిగాను ఉన్నాను. అలాంటి అసెంబ్లీ నేడు నిరూప‌యోగంగా మారింది. ఎలాంటి అధికారాలు లేని ఆ అసెంబ్లీలో ఇక‌పై స‌భ్యుడిగా ఉండ‌లేను" అని  ఆయ‌న వ్యాఖ్యానించారు. జ‌మ్ముక‌శ్మీర్‌కు ప్ర‌త్యేక ప్ర‌తిప‌త్తి క‌ల్పించే ఆర్టిక‌ల్ 370ని కేంద్ర ప్ర‌భుత్వం గ‌త ఏడాది ఆగ‌స్టు 5న ర‌ద్దు చేయ‌డంతోపాటు ఆ రాష్ట్రాన్ని జ‌మ్ముక‌శ్మీర్‌, ల‌ఢ‌క్ కేంద్ర‌పాలిత ప్రాంతాలుగా విభ‌జించిన సంగ‌తి తెలిసిందే. ఇది జ‌రిగి ఏడాది కావోస్తున్న నేప‌థ్యంలో ఈ మేర‌కు ఆయ‌న‌ స్పందించారు. 

2019 ఆగ‌స్టు 5న జ‌మ్ముక‌శ్మీర్ ప‌ట్ల కేంద్రం వ్య‌వ‌హ‌రించిన విధానానికి ఎలాంటి రాజ్యాంగ‌, న్యాయ‌, ఆర్థిక‌, భ‌ద్ర‌తా‌ప‌ర‌మైన స‌మ‌ర్థ‌న లేద‌ని ఒమ‌ర్ అబ్దుల్లా తెలిపారు. సుప్రీంకోర్టులో త‌మ పార్టీ దాఖ‌లు చేసిన కేసు‌కు ఇదే మూలమ‌ని ఆయ‌న అన్నారు. జ‌మ్ముక‌శ్మీర్ ప‌ట్ల కేంద్రం వ్య‌వ‌హ‌రించిన తీరును త‌మ పార్టీ ఎప్ప‌టికీ అంగీక‌రించ‌ద‌ని, జ‌మ్ముక‌శ్మ‌ర్ ప్ర‌త్యేక హోదా ర‌ద్దు, రాష్ట్ర విభ‌జ‌న‌ను ఎప్ప‌టికీ ఆమోదించ‌బోమ‌ని ఒమ‌ర్ అబ్దుల్లా స్ప‌ష్టం చేశారు. 


logo