శనివారం 15 ఆగస్టు 2020
Ashoka Developers
National - Jul 24, 2020 , 01:27:44

పిల్లలతో ‘హెర్డ్‌ ఇమ్యూనిటీ’?

పిల్లలతో ‘హెర్డ్‌ ఇమ్యూనిటీ’?

  • వాళ్లలో ఫ్రెష్‌ ఇమ్యూనిటీ ఎక్కువ 
  • స్కూళ్లు, కాలేజీలను తెరువడం మంచిది
  • వైద్య నిపుణుల అభిప్రాయం

న్యూఢిల్లీ: దేశంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతున్న ఈ సమయంలో స్కూళ్లు, కాలేజీలను తిరిగి తెరిస్తే పిల్లలపై వైరస్‌ ప్రభావం ఉండే అవకాశమున్నదని తల్లిదండ్రులు, టీచర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఇలాంటి విపత్కర సమయంలో స్కూళ్లను తెరువడం ద్వారా వైరస్‌ను కట్టడి చేయడానికి సాయపడే సామూహిక రోగనిరోధక శక్తి (హెర్డ్‌ ఇమ్యూనిటీ) అభివృద్ధి చెందుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ‘పిల్లలు, కౌమారంలో ఉన్న వారిలో రోగనిరోధక శక్తి ఎక్కువ చైతన్యవంతంగా (ఫ్రెష్‌ ఇమ్యూనిటీ) ఉంటుంది. కేసులు పెరుగుతున్న ఈ సమయంలో స్కూళ్లు, కాలేజీలను తెరిస్తే అది ‘హెర్డ్‌ ఇమ్యూనిటీ’ అభివృద్ధికి సాయపడుతుంది. దీంతో చాలామందిని వైరస్‌ బారి నుంచి కాపాడుకోవచ్చు. అమెరికాలోని కరోనా కేసుల గణాంకాలను విశ్లేషిస్తే.. అక్కడి 24 జిల్లాల్లో ఏ ఒక్క చిన్నారి కూడా కరోనాతో మరణించలేదు’ అని పుణెలోని డీవై పాటిల్‌ మెడికల్‌ కాలేజీ హెడ్‌ డాక్టర్‌ అమితావ్‌ బెనర్జీ తెలిపారు. వయస్సు, బాడీ మాస్‌ ఇండెక్స్‌ (బీఎంఐ - బరువుకు తగిన ఎత్తు) కరోనా మరణాల్లో కీలక పాత్ర పోషిస్తాయన్నారు. ‘శానిటైజర్‌తో రాసుకోవడం, చేతులు శుభ్రం చేసుకోవడం, భౌతిక దూరం పాటించడం వంటి నియమాలను పాటిస్తూ స్కూళ్లు, కాలేజీలను వెంటనే తెరువడం ఇప్పుడు ముఖ్యం. ఫ్రెష్‌ ఇమ్యూనిటీ కలిగిన పిల్లలు హెర్డ్‌ ఇమ్యూనిటీ అభివృద్ధికి సాయపడుతారు. వ్యాక్సిన్‌ రావడానికి  మరికొంత సమయం పడుతుండటం వల్ల ఎక్కువ మందిని కాపాడుకోవాలంటే ఇదొక్కటే మార్గం. ఇది కొంచం క్లిష్టమైన ప్రక్రియ అయినప్పటికీ జాగ్రత్తలు పాటిస్తే విజయం సాధించవచ్చు. ఇదే సమయంలో వైరస్‌ పరీక్షల సంఖ్యను కూడా పెంచాల్సిన అవసరం ఉన్నది’ అని ఎయిమ్స్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ సంజయ్‌ కే రాయ్‌ తెలిపారు. దేశ జనాభాలో 70 శాతం మంది వైరస్‌ ప్రభావానికి గురై.. సొంతంగా రోగనిరోధక వ్యవస్థను పెంపొందించుకొని మహమ్మారి నుంచి బయటపడే ప్రక్రియను ‘హెర్డ్‌ ఇమ్యూనిటీ’ అంటారు.


logo