శుక్రవారం 14 ఆగస్టు 2020
National - Jul 21, 2020 , 00:55:41

బెయిల్‌ ఎలా వచ్చింది?

బెయిల్‌ ఎలా వచ్చింది?

  • ఇది వ్యవస్థ వైఫల్యమే!
  • l దూబే కరుడుగట్టిన నేరస్థుడు 
  • l దిశ కేసుకు, దూబే కేసుకు  చాలా వ్యత్యాసమున్నది
  • l చట్టాన్ని యూపీ సర్కార్‌  పకడ్బందీగా అమలు   చేయాలి: కోర్టు

న్యూఢిల్లీ: కరుడుగట్టిన నేరస్థుడు వికాస దూబేకు బెయిల్‌ రావడంపై సుప్రీంకోర్టు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసింది. అరవైకి పైగా కేసుల్లో నిందితుడిగా ఉన్న దూబే దర్జాగా బయట తిరుగడంపై ఆందోళన వ్యక్తం చేసింది. ఇది కచ్చితంగా వ్యవస్థ వైఫల్యమేనన్నది. గతేడాది తెలంగాణలో జరిగిన దిశ కేసులోని నిందితుల ఎన్‌కౌంటర్‌కు, ఈ కేసుకు చాలా వ్యత్యాసమున్నదని అభిప్రాయం వ్యక్తం చేసింది. ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం చట్టాన్ని పకడ్బంధీగా అమలు చేయాల్సిన అవసరమున్నదని సూచించింది. గ్యాంగ్‌స్టర్‌ వికాస్‌ దూబే ఎన్‌కౌంటర్‌పై దాఖలైన పలు పిటిషన్లపై సోమవారం విచారణ చేపట్టిన సర్వోన్నత ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ‘లెక్కకు మించిన కేసుల్లో నిందితుడిగా ఉన్న ఓ వ్యక్తి జైలు గోడల మధ్య ఉండాలి. అయితే బెయిల్‌తో బయట తిరిగాడు. ఇది కచ్చితంగా వ్యవస్థ వైఫల్యమే. దూబే వంటి కరుడుగట్టిన నేరస్తుడు బయట ఎంతో దర్జాగా తిరిగాడన్న విషయమే భయాన్ని, ఆందోళనను కలిగిస్తున్నది’ అని ప్రధాన న్యాయమూర్తి ఎస్‌ఏ బోబ్డే, న్యాయమూర్తులు ఏఎస్‌ బోపన్న, వీ రామ సుబ్రహ్మణ్యంతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విస్మయాన్ని వ్యక్తం చేసింది. ‘ఈ కేసు విషయంలో యూపీ సర్కార్‌ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలి. ఇది మీ విధి’ అని వ్యాఖ్యానించింది. 

కరోనా టైమ్‌లో తిరగాలా?

దూబే ఎన్‌కౌంటర్‌ కేసుకు సంబంధించి ఏర్పాటు చేసిన విచారణ కమిటీలో టాప్‌ కోర్టుకు చెందిన సిట్టింగ్‌ న్యాయమూర్తి ఉండాలన్న ఓ పిటిషనర్‌ అభ్యర్థనను సుప్రీంకోర్టు తప్పుబట్టింది. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో అలహాబాద్‌కు వెళ్లి కేసు గురించి విచారించమని న్యాయమూర్తులకు తాము చెప్పలేమన్నది. ఇదే సమయంలో దూబే కేసు విచారణ కమిటీలో హైకోర్టు మాజీ న్యాయమూర్తి శశికాంత్‌ అగర్వాల్‌ ఉన్నారని తెలుపుతూ యూపీ సర్కార్‌ ఓ అఫిడవిట్‌ దాఖలు చేసింది. దీనిపై స్పందించిన ధర్మాసనం.. విచారణ కమిటీలో మార్పులు చేయాలని ప్రభుత్వానికి సూచించింది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి, రిటైర్డ్‌ పోలీసు అధికారిని  విచారణ కమిటీలో చేర్చాలని ఆదేశించింది. ఈ వివరాలను బుధవారంలోగా కోర్టుకు సమర్పించాలన్నది. కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు తెలంగాణలో గతేడాది జరిగిన దిశ ఘటనను ప్రస్తావించింది. ఆ కేసుకు , దూబే కేసుకు మధ్య చాలా వ్యత్యాసమున్నదని పేర్కొంది. యూపీ సర్కార్‌ చట్టాన్ని సరిగ్గా అమలు చేయాలని సూచించింది. మరోవైపు, దూబే పోస్ట్‌మార్టం నివేదిక సోమవారం వెల్లడైంది. ఎన్‌కౌంటర్‌లో భాగంగా మూడు బుల్లెట్‌లు చేసిన గాయాల వల్ల తీవ్ర రక్తస్రావమై దూబే మరణించినట్టు నివేదిక వెల్లడించింది. జరిగిన హఠాత్పరిణామానికి దూబే షాక్‌కి గురై మృత్యువాతపడ్డట్టు వైద్యులు వెల్లడించారు.  


logo