మంగళవారం 04 ఆగస్టు 2020
National - Jul 19, 2020 , 02:12:05

సమూహ వ్యాప్తి మొదలైంది!

సమూహ వ్యాప్తి మొదలైంది!

  • ప్రకటించిన భారతీయ వైద్య మండలి 
  • సామూహిక రోగనిరోధకశక్తి, వ్యాక్సిన్‌తోనే కట్టడి
  • సెప్టెంబర్‌లో పరాకాష్టకు.. ఆ తర్వాత తగ్గుముఖం
  • పబ్లిక్‌ హెల్త్‌ ఫౌండేషన్‌ ఆఫ్‌ ఇండియా వెల్లడి

న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతూ.. సగటున మూడు రోజుల్లో లక్ష చొప్పున నమోదవటం వెనుక ఉన్న కారణాన్ని భారతీయ వైద్య మండలి (ఐఎంఏ) వెల్లడించింది. ఇప్పటికే మనదేశంలో కరోనా వైరస్‌ సామూహిక సంక్రమణ దశలోకి ప్రవేశించిందని ప్రకటించింది. ఇంతకాలం పట్టణాలు, నగరాల్లోనే ఎక్కువ ప్రభావం చూపిస్తున్న మహమ్మారి.. ఇప్పుడు గ్రామాల్లోకీ ప్రవేశిస్తున్నదని హెచ్చరించింది. మరోవైపు, వచ్చే రెండు నెలల్లో కరోనా కేసులు గరిష్ఠస్థాయికి (పీక్‌స్టేజికి) చేరుకోవచ్చని.. ఆ తర్వాత క్రమంగా వైరస్‌ వ్యాప్తి తగ్గుముఖం పట్టవచ్చని పబ్లిక్‌ హెల్త్‌ ఫౌండేషన్‌ ఆఫ్‌ ఇండియా అంచనా 

వేసింది. అయితే, కేంద్రం మాత్రం.. దేశంలో చికిత్స పొందుతున్న వారి సంఖ్య (యాక్టివ్‌ కేసుల) కన్నా.. కోలుకున్న వారి (రికవరీల) సంఖ్య రెట్టింపునకు చేరుకున్నదని.. ఇదొక సానుకూల పరిణామం అని శనివారం వెల్లడించింది. దేశంలో రికవరీ రేటు 63 శాతంగా నమోదైందని పేర్కొంది.

పరిస్థితులు దిగజారాయి 

కరోనా ఉద్ధృతి నేపథ్యంలో దేశంలో పరిస్థితులు దిగజారాయని ఐఎంఏ హాస్పిటల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా చైర్మన్‌ డాక్టర్‌ వీకే మోంగా ఆందోళన వ్యక్తం చేశారు. ‘దేశంలో కేసులు క్రమంగా పెరుగడానికి పలు కారణాలు ఉన్నప్పటికీ.. మహమ్మారి గ్రామాలకు కూడా వ్యాపిస్తుండటం ఆందోళన కలిగిస్తున్నది. దుష్పరిణామాలకు ఇది సంకేతం. పరిస్థితులను చూస్తే దేశంలో కరోనా వైరస్‌ సామూహిక సంక్రమణ దశలోకి ప్రవేశించినట్టు అర్థమవుతున్నది’ అని చెప్పారు. పట్టణాలు, గ్రామాల్లో వైరస్‌ను కట్టడి చేయడం క్లిష్టమైన ప్రక్రియ అన్నారు. కరోనా కట్టడికి రెండు మార్గాలు మాత్రమే ఉన్నాయని మోంగా సూచించారు. ‘మొదటిది.. దేశ జనాభాలో 70 శాతం మంది వైరస్‌ ప్రభావానికి గురై.. సొంతంగా రోగనిరోధకవ్యవస్థను పెంపొందించుకొని దాని నుంచి బయటపడటం (దీనినే సామూహిక రోగనిరోధకశక్తిని సంతరించుకోవటం అని అంటారు). రెండోది.. మిగిలిన 30 శాతం మందిలో టీకా (వ్యాక్సిన్‌) ద్వారా రోగనిరోధక శక్తిని పెంపొందించటం’ అని చెప్పారు. వ్యాక్సిన్‌ ద్వారా రోగుల్లో రోగనిరోధక శక్తి పెంచినప్పటికీ, అది మూడు నెలల కంటే ఎక్కువ కాలం ఉండకపోవచ్చన్నారు.

మే 3 తర్వాతే తీవ్రత 

దేశంలో వచ్చే సెప్టెంబర్‌ మధ్య నాటికి వైరస్‌ కేసులు గరిష్ఠ స్థాయికి చేరుకోవచ్చని (ఆ తర్వాత క్రమంగా తగ్గుముఖం పడుతాయని) పబ్లిక్‌ హెల్త్‌ ఫౌండేషన్‌ ఆఫ్‌ ఇండియా అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కే శ్రీకాంత్‌ రెడ్డి తెలిపారు. మహమ్మారి కట్టడికి ప్రభు త్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడం, ప్రజలు కూడా బాధ్యతాయుతంగా ప్రవర్తించడం ద్వారానే ఇది సాధ్యపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. వైరస్‌ నియంత్రణకు రెండో దశ లాక్‌డౌన్‌ వరకు గట్టి చర్యలు అమలైనట్టు తెలిపారు. మే 3 తర్వాత లాక్‌డౌన్‌ సడలింపుల్లో భాగంగా ఆంక్షలను క్రమంగా ఎత్తివేయడంతో వైరస్‌ పంజా విసిరిందన్నారు. ఇదిలా ఉండగా.. కేరళలో కరోనా ఉద్ధృతి ఎక్కువగా ఉన్న 84 కొవిడ్‌-19 క్లస్టర్లలో వైరస్‌ సామూహిక సంక్రమణ 50 శాతం కంటే ఎక్కువగా ఉన్నదని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి కేకే శైలజ శనివారం తెలిపారు. అయితే క్లస్టర్ల వెలుపల ఇది 10 శాతం కంటే తక్కువగా ఉన్నదన్నారు.


logo