బుధవారం 12 ఆగస్టు 2020
National - Jul 16, 2020 , 18:37:32

టీటీడీలో కరోనా కలకలం .. 140 మందికి పాజిటివ్

టీటీడీలో కరోనా కలకలం .. 140 మందికి పాజిటివ్

తిరుమల: ఏపీలో కరోనా మహమ్మారి రోజు రోజుకు విస్తరిస్తోంది. తాజాగా టీటీడీలో 140 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో ఆందోళన నెలకొంది. ఇదే విషయంపై టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. కరోనా వైరస్ వల్ల భక్తులకు ఇబ్బందులు రాకుండా ఉండేందుకు అధికారులతో సమావేశం నిర్వహిస్తున్నామని  తెలిపారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ.. దర్శనాలు ప్రారంభించాక టీటీడీలో విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహిస్తే 140 మందికి పాజిటివ్ వచ్చిందని పేర్కొన్నారు. పాజిటివ్‌ వచ్చిన వారిలో అర్చకులు, టీటీడీ ఉద్యోగులు, ఎస్టీఎఫ్ సెక్యూరిటీ సిబ్బంది, లడ్లు తయారు చేసే సిబ్బంది ఉన్నారని వెల్లడించారు. కరోనా పాజిటివ్‌ వచ్చిన వారిలో 70 మంది కోలుకుని హోం క్వారంటైన్‌‌లో ఉండగా, క్వారంటైన్‌లో ఉన్నవారిలో ఒక్కరు మినహా అందరు ఆరోగ్యంగా ఉన్నారని ఆయన తెలిపారు.

కాగా, 40 మంది అర్చకుల్లో 14 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చిందన్నారు. అలాగే 60 సంవత్సరాలు నిండిన అర్చకులకి విధుల నుండి సడలింపు ఇచ్చామని తెలిపారు. రమణ దీక్షితులు చేసిన ట్వీట్‌కు రాజకీయ రంగు పులమకండని, గౌరవ ప్రధాన అర్చకులుగా ఉండి ఇలా ట్వీట్ చేయటం మంచి పద్దతి కాదని సూచించారు. ఏమైనా సమస్య ఉంటే రమణ దీక్షితులుతో కూడా చర్చిస్తామని అన్నారు. అర్చకులకి ప్రమాదకరమైన పరిస్థితి నెలకొంటే దర్శనాలు కూడా ఆపివేస్తామని అన్నారు.  



logo