శుక్రవారం 07 ఆగస్టు 2020
National - Jul 02, 2020 , 13:04:56

యాప్‌ల నిషేధం.. డిజిట‌ల్ స్ట్ర‌యిక్ : కేంద్ర మంత్రి ర‌విశంక‌ర్ ప్ర‌సాద్‌

యాప్‌ల నిషేధం.. డిజిట‌ల్ స్ట్ర‌యిక్ :  కేంద్ర మంత్రి ర‌విశంక‌ర్ ప్ర‌సాద్‌

హైద‌రాబాద్‌: ఈస్ట్ర‌న్ ల‌డ‌క్‌లో మ‌న‌ సైనికుల‌పై చైనా పాశ‌విక దాడి చేసిన నేప‌థ్యంలో.. భార‌త ప్ర‌భుత్వం దానికి ప్ర‌తీకారంగా డ్రాగ‌న్‌కు చెందిన 59 యాప్‌ల‌ను నిషేధించిన విష‌యం తెలిసిందే.  దీనిపై కేంద్ర ఐటీశాఖ మంత్రి ర‌విశంక‌ర్ ప్ర‌సాద్ స్పందించారు.  చైనా యాప్‌ల నిషేధాన్ని ఆయ‌న డిజిటల్ స్ట్రయిక్‌గా అభివ‌ర్ణించారు. దేశ ప్ర‌జ‌ల డేటాను సుర‌క్షితంగా ఉంచేందుకే చైనా యాప్‌ల‌ను బ‌హిష్క‌రించామ‌ని, ఇది డిజిట‌ల్ దాడి అని ఆయ‌న అన్నారు. మ‌న వైపు 20 మంది జవాన్లు చ‌నిపోతే, వారి వైపు ఆ సంఖ్య రెట్టింపు ఉంటుంద‌ని తెలిపారు. ఉరి, పుల్వామా ఉగ్ర‌దాడుల త‌ర్వాత మ‌నం ఎలా ప్ర‌తి దాడి చేశామో గుర్తు చేసుకోవాల‌ని మంత్రి అన్నారు. ప‌శ్చిమ బెంగాల్‌లో ర్యాలీలో పాల్గొన్న ఆయ‌న ఈ వ్యాఖ్య‌లు చేశారు. 

భార‌త్ శాంతిని కాంక్షిస్తున్న‌ద‌ని, కానీ ఎవ‌రైనా చెడు దృష్టితో చూస్తే వారికి త‌గిన బ‌దులు ఇస్తామ‌న్నారు. సోమ‌వారం రోజున భార‌త్ 59 చైనా యాప్‌ల‌ను బ‌హిష్క‌రించింది.  దాంట్లో పాపుల‌ర్ యాప్‌లైన టిక్‌టాక్‌, యూసీ బ్రౌజ‌ర్‌, స్కామ్‌, షేర్ఇట్‌లు ఉన్నాయి. ల‌డ‌ఖ్‌లో వాస్త‌వాధీన రేఖ వెంట ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్న విష‌యంలో భార‌త ప్ర‌భుత్వం ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ది.  


logo