శనివారం 04 జూలై 2020
National - Jun 18, 2020 , 06:51:29

హర్యానాలో కంపించిన భూమి... 2.1గా భూకంప తీవ్రత

హర్యానాలో కంపించిన భూమి... 2.1గా భూకంప తీవ్రత

హైదరాబాద్‌: ఉత్తర భారతదేశంలో వరుస భూ ప్రకంపనలు కొనసాగుతున్నాయి. గత పదిహేను రోజులుగా ఉత్తర భారతంలోని ఏదో ఒక ప్రాంతంలో భూమి కంపిస్తున్నది. నిన్న ముంబైలో భూకంపం సంభవించగా, తాజాగా ఈరోజు తెల్లవారుజామున 4గంటల 18 నిమిషాలకు హర్యానాలోని రోహ్‌తక్‌లో భూమి కంపించింది. దీని తీవ్రత భూకంప లేఖినిపై 2.1గా నమోదయ్యింది. రోహ్‌తక్‌కు ఆగ్నేయంగా 15 కి.మీ.దూరంలో భూకంప కేంద్రం ఉన్నదని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సిస్మోలజీ ప్రకటించింది.   

రోహ్‌తక్‌లో మే 29న రాత్రి భూకంపం సంభవించింది. దీని తీవ్రత 4.6గా నమోదయ్యింది. దీని ప్రభావం ఢిల్లీ, నోయిడా, గురుగ్రామ్‌లో కూడా కనిపించింది. ఈ నెల 1వ తేదీ కూడా రోహ్‌తక్‌లో 5.0 తీవ్రతతో భూమి కంపించింది. జూన్‌ 8న ఢిల్లీలో భూమి స్వల్పంగా కంపించింది. దీని తీవ్రత 2.1గా నమోదయ్యింది. దీని భూకంప కేంద్రం హర్యానాలోని గురుగ్రామ్‌ సమీపంలో ఉన్నదని నేషనల్‌ సెంటర్‌ఫర్‌ సెస్మోలజీ సెంటర్‌ వెల్లడించింది.  

గత నెల చివరి వారం నుంచి జమ్ముకశ్మీర్‌, హర్యానా, ఢిల్లీ, గుజరాత్‌, మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాల్లో భూమి కంపిస్తున్నది. ఈ నెల 14, 15 తేదీల్లో వరుసగా రెండు రోజులు గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో భూమి కంపించింది.


logo