ఆదివారం 05 జూలై 2020
National - Jun 17, 2020 , 13:45:38

భారత్‌, చైనా ఘర్షణపై అంతర్జాతీయ మీడియా భారీ స్పందన

భారత్‌, చైనా ఘర్షణపై అంతర్జాతీయ మీడియా భారీ స్పందన

న్యూఢిల్లీ: లఢక్‌లోని గాల్వాన్‌ లోయలో భారత్‌, చైనా సైనికుల మధ్య మంగళవారం జరిగిన ముఖాముఖి ఘర్షణపై అంతర్జాతీయ మీడియా భారీగా స్పందించింది. పులులైన భారతీయ జవాన్లను చైనాకు చెందిన పీపుల్స్‌ లిబరేషన్ ఆర్మీ రెచ్చగొడుతున్నదని అమెరికాకు చెందిన వాషింగ్టన్ ఎగ్జామినర్ పేర్కొంది. జమ్ముకశ్మీర్‌లోని పుల్వామాలో భారత సైనికులపై జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని బాలాకోట్‌పై వాయుసేన మెరుపుదాడులకు ఆదేశించిన భారత ప్రధాని మోదీ ఈ ఘర్షణపై ఎలా స్పందిస్తారోనని వ్యాఖ్యానించింది. సరిహద్దులో ఘర్షణ వాతావరణాన్ని నివారించేందుకు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌, భారత ప్రధాని మోదీ ఎంత జాగ్రత్త వహించినప్పటికీ పరిస్థితులు నియంత్రణలో లేనట్లు కనిపిస్తున్నాయని న్యూయార్క్‌ టైమ్స్‌ పేర్కొంది. 

ప్రపంచంలోని రెండు ప్రముఖ దేశాలైన భారత్‌, చైనా తమ శక్తిసామర్థ్యాలపై ఒకరినొకరు హెచ్చరించుకుంటున్నాయని వాషింగ్టన్‌ పోస్ట్‌ అభిప్రాయపడింది. రెండు అణ్వాయుధ దేశాల మధ్య రాళ్లు, కర్రలతో’అసాధారణ ఉద్రిక్తత‘... అని బీబీసీ పేర్కొంది. నాలుగు దశాబ్దలుగా ఇరు దేశాల సరిహద్దులో ఒక్క కాల్పుల ఘటన జరుగనప్పటికీ కొన్ని నెలలుగా ఉద్రిక్తతలు పెరుగుతుండటం ఆశ్చర్యం కలిగిస్తున్నదని వెల్లడించింది. మరోవైపు మితిమీరిన జాతీయవాదం వల్ల ఎదురయ్యే ప్రమాదానికి ఈ ఘర్షణ ఒక నిదర్శనమని ది గార్డియన్‌ పత్రిక వ్యాఖ్యానించింది.


logo