ఆదివారం 31 మే 2020
National - May 23, 2020 , 15:40:39

ఆ గ్రామం ఏడాదిలో నెల రోజులు మాత్రమే కనిపిస్తుంది... ఎందుకంటే?

ఆ గ్రామం ఏడాదిలో  నెల రోజులు మాత్రమే కనిపిస్తుంది... ఎందుకంటే?

పనాజి : గోవాలోని ఓ గ్రామం ఏడాదిలో 11 నెలలు నీటిలోనే మునిగి ఉంటుంది. కేవలం ఒక్క నెలరోజులు మాత్రమే బయటకు కనిపిస్తుంది. ఈ ప్రాంతంలో నివసించే ప్రజలు మరొక చోట స్థిరపడ్డారు. నీటి నుంచి బయటపడే ఆ ఒక్క నెలలో ప్రజలంతా ఆ గ్రామానికి చేరుకుని పండుగ నిర్వహిస్తారు. పశ్చిమ కనుమల్లో ఒదిగి ఉన్న ఈ అందమైన కుగ్రామం పేరు 'కుర్ది'. గోవా లోని అతిపెద్ద నది జువారి నుంచి విడిపోయి ప్రవహించే సలౌలిం నది పరివాహిక ప్రాంతంలో ఈ గ్రామం ఉన్నది. ఈశాన్య గోవాలోని సుసంపన్నమైన గ్రామాల్లో ఒకటిగా కుర్ది గ్రామం ఒకప్పుడు పేరుగాంచింది. అయితే కొన్ని దశాబ్ధాలుగా ఈ గ్రామం ఓ మాయాజాలంలా మాయం కావడం మొదలైంది. ఏడాదిలో కేవలం మే నెలలో మాత్రమే ఇది కనిపిస్తుంది.

1986లో సలౌలిం నదిపై మొట్టమొదటి జలాశయం నిర్మించారు. దీంతో ఆ నది పరివాహిక ప్రాంతమైన కుర్ది పూర్తిగా నీట మునిగింది. ఇప్పుడు ప్రతి ఏటా వేసవి కాలంలో ముఖ్యంగా మే నెలలో నీటి మట్టం తగ్గినప్పుడు మాత్రమే ఈ గ్రామం బయటపడుతుంది. ఆ సమయంలో చెట్ల కొయ్యలు, పగుళ్లతో నిండిన భూమి, మతపరమైన నిర్మాణాలు, శిధిలమైన గృహాలు, శిధిలాలు మెళ్ల కొద్దీ విస్తరించి చెల్లాచెదురుగా కనిపిస్తాయి. గతంలో ఈ గ్రామం ఎంతో సారవంతమైనదిగా ఉండేది. మూడువేలకు పైగా జనాభా నివసించే వారు. జీడిపప్పు, కొబ్బరి, జాక్ ఫ్రూట్, మామిడి చెట్లు, వరి పొలాలతో సంపన్నమైన వ్యవసాయ గ్రామంగా కుర్ది వెలుగొందింది. అన్ని మతాలకు చెందిన ప్రజలు ఇక్కడ నివసించేవారు. దీనికి చిహ్నంగా ఈ గ్రామంలో అనేక దేవాలయాలు, మసీదులు, చర్చి అవశేషాలు కనిపిస్తాయి. 1961లో పోర్చుగీసుల నుంచి గోవా విముక్తి పొందిన కొన్ని దశాబ్ధాల్లోనే ఇక్కడి పరిస్థితులు వేగంగా మార్పుచెందాయి. అప్పటి గోవా ముఖ్యమంత్రి దయానంద్ బండోడ్కర్ కుర్ది గ్రామాన్ని సందర్శించా రు.

గోవాలో ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన మొట్ట మొదటి జలాశయం గురించి, దాని వలన మొత్తం దక్షిణ గోవాకు చేకూరే ప్రయోజనం గురించి ప్రజలకు వివరించారు. ఈ జలాశయం కారణంగా కుర్ది గ్రామం నీట మునుగుతుందని, అందువలన ఆ గ్రామాన్ని ఖాళీ చేయాలని కోరారు. ప్రజలను ఒప్పించి జలాశయం నిర్మాణానికి అడ్డంకులు తొలగించారు. దీంతో ఆ గ్రామ ప్రజలు గోవాలోని ఇతర ప్రాంతాలకు వలస వెళ్లాల్సి వచ్చింది. ప్రభుత్వం వారికి ఆయా ప్రదేశాల్లో భూమి, పరిహారం అందించినప్పటికీ కుర్ది గ్రామంలో ఉన్న కనీస సౌకర్యాలు వారికి అక్కడ లభించలేదు. 

ప్రతిష్టాత్మకమైన ఈ ప్రాజెక్టును దక్షిణ గోవాలోని చాలా ప్రాంతాల్లో వ్యవసాయం, తాగునీరు, పరిశ్రమలకు నీటిని అందించేందుకు చేపట్టారు. దీని కారణంగా లక్షలాది ఎకరాలకు సాగునీరు, వందలాది గ్రామాలకు సాగునీరు సమకూరుతుంది. కానీ తమ గ్రామాన్ని ఖాళీ చేసి వలస వెళ్లిన నిర్వాసితులకు మాత్రం ఈ నీరు అందకపోవడం విచారకరం. అయినప్పటికీ ప్రతి ఏటా మే నెలలో నీటి మట్టం తగ్గిన తరువాత కుర్ది గ్రామ ప్రజలు ఇక్కడికి చేరుకుని కోల్పోయిన తమ ప్రాంతంలో విందులను చేసుకుంటారు. ప్రతి ఏటా మే నెలలో ఈ గ్రామం సందర్శనకు అనువుగా ఉంటుంది. ఈ సమయంలో ప్రజలు ఇక్కడి సోమేశ్వర్ ఆలయం వద్ద పెద్ద ఉత్సవాన్ని నిర్వహించి తమ పాత జ్ఞాపకాలను నెమరువేసుకుంటారు. అనేక మతపరమైన కార్యక్రమాలను ఈ ఉత్సవంలో నిర్వహిస్తారు. వర్షాకాలంలో ఈ ప్రాంతానికి వస్తే ఇక్కడ ఓ గ్రామం ఉందనే విషయం ఎవరూ కనుగొనలేరు. జలాశయంలో సోమేశ్వర్ ఆలయంపై కప్పు మాత్రమే కనిపిస్తుంది. గోవా, కర్వార్ నుంచి భక్తులు ప్రతి ఏటా ఈ ఆలయాన్ని సందర్శించుకుంటారు.  


logo