మంగళవారం 26 మే 2020
National - May 20, 2020 , 18:04:52

అన్నదాతకు అండగా అపార్ట్ మెంట్ వాసులు

అన్నదాతకు అండగా  అపార్ట్ మెంట్ వాసులు

బెంగళూరు : దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలు నేపథ్యంలో అన్నదాతలు ఎంతో శ్రమించి పండించిన కూరగాయలు కొనేవారు లేక, వాటిని మార్కెట్లకు తీసుకెళ్లేందుకు రవాణా సౌకర్యాలు లేక అన్నదాతలు  అగచాట్లు పడుతున్నారు. కూరగాయలు ఎక్కడివి అక్కడే  ఆగిపోయాయి. మరికొంత మంది రైతులు తాము పండించిన వాటికి సరైన ధర లేక నేలపాలు చేస్తున్నారు. బెంగళూరు పరిసర ప్రాంతాల్లోని అన్నదాతల ఆగచాట్లను అక్కడి సర్జపురా రెసిడెంట్స్ వెల్ ఫేర్ అసోసియేషన్(ఎస్ ఆర్ డబ్ల్యు ఏ)  ప్రధాన కార్యదర్శి జాయ్ వీఆర్ గమనించాడు. అసోసియేషన్ సభ్యలందరికీ రైతుల కష్టాలను గురించి తెలిపాడు. దీంతో వారంతా ఏకతాటిపై వచ్చి రైతులకు అండగా నిలిచేందుకు ముందుకువచ్చారు. అసోసియేషన్ సభ్యులందరూ అక్కడి గ్రామీణ ప్రాంతాలకు చెందిన రైతుల వద్దనే కూరగాయలు కొనాలని నిశ్చయించుకున్నారు. అలా ప్రతి రోజూ ఆయా పరిసర ప్రాతం లోని రైతులు పండించిన కూరగాయలను నేరుగా సర్జపురా రెసిడెంట్స్ వెల్ ఫేర్ అసోసియేషన్ సభ్యులకు అమ్ముతున్నారు. అక్కడి పరిసర ప్రాంతాల్లో పండిన పంటలను నగర వాసులకు అందించడానికి లాక్ డౌన్ నిబంధనల కు లోబడి అనుమతి తీసుకున్నారు. ఎస్ ఆర్ డబ్ల్యుఏ సభ్యులు ఆ రైతులు వద్ద కూరగాయలు కొనడానికి వాట్సాప్,ఫేస్ బుక్ గ్రూపు లను క్రియేట్ చేశారు. ఈ రెండు గ్రూపుల్లో 700మందికి పైగా కొనుగోలుదారులను చేర్చారు. వీరంతా  అక్కడి రైతుల వద్ద కొనుగోలు చేయడం వల్ల రోజుకి అక్కడి రైతులకు రూ.15వేల ఆదాయం చేకూరుతున్నది.  రైతులు ఏ సమయానికి వస్తారు? ఏమేం కూరగాయలు ఉన్నాయనే వివరాలు ఆయా గ్రూపులకు ముందస్తుగా  తెలియజేస్తారు. అలా ప్రతిరోజూ అక్కడి రైతులు పండించిన తాజా కూరగాయల ను నగరాల్లో ఉండే అపార్ట్ మెంట్, విల్లాల్లో ఉండే వారంతా కొనుగోలు చేస్తూ సమిష్టిగా అన్నదాతకు అండగా నిలుస్తున్నారు. ఉదయం 7 గంటల నుంచి 10 గంటల వరకు లాక్ డౌన్ నిబంధనలను అనుసరించి అపార్టు మెంట్ వాసులు కూరగాయలు కొనుగోలు చేస్తున్నారు. ఇటువంటి కష్ట కాలం లో రైతులను ఆదుకోవడానికి ముందుకు వచ్చిన సర్జపురా రెసిడెంట్స్ వెల్ ఫేర్ అసోసియేషన్ సభ్యుల చొరవను బెంగళూరు పోలీస్ కమీషనర్ భాస్కరరావు ట్విట్టర్ ద్వారా ప్రశంసించారు. దళారీల తో పనిలేకుండా అటు అన్నదాతలకు ,ఇటు వినియోగదారులకు ఇద్దరికీ ప్రయోజనం చేకూరుతున్నదని ,సర్జపురా రెసిడెంట్స్ వెల్ ఫేర్ అసోసియేషన్ సభ్యులు గొప్ప పని చేసారంటూ"ఆయన ట్విట్టర్ ఖాతా లో పేర్కొన్నారు.


logo