బుధవారం 03 జూన్ 2020
National - May 17, 2020 , 14:24:05

మహమ్మారిని పసిగట్టేసే పరికరాలు

 మహమ్మారిని పసిగట్టేసే పరికరాలు

హైదరాబాద్ : కరోనా ఆనవాళ్లను వేగంగా కనిపెట్టేందుకు అవసరమైన పరికరాలను తయారు చేసే పనిలో నిమగ్నమయ్యాయి ప్రపంచ దేశాలు. ఇప్పటికే కొన్ని దేశాలు ఆ విషయం లో ముందుండగా భారత్ కూడా అదే బాటలోనే నడుస్తున్నది. దగ్గుతో బాధపడుతున్న వ్యక్తి కి కరోనా లక్షణాలున్నాయా? లేదా? ఆ దగ్గు నిజంగానే ప్రమాదమా ? అనే విషయాన్ని గుర్తించగలిగే పరికరాన్ని పశ్చిమ బెంగాల్లోని జాదవ్ పూర్ యూనివర్సిటీకి చెందిన విద్యార్థులు అభివృద్ధి చేశారు. ఈ నాన్ కాంటాక్ట్ పరికరాన్ని ప్రవేశ పెట్టారు. వ్యక్తి దూరంగా ఉన్నా, ఆ వ్యక్తి ధ్వని లేదా ఫొటోను బట్టి గుర్తించి తక్షణమే జాగ్రత్త పడవచ్చు. ఎలక్ట్రానిక్స్, టెలీకమ్యూనికేషన్ ఇంజినీరింగ్ మూడో సంవత్సరం చదువుతున్న అన్నేసియా బెనర్జీ,ఆచల్ నిహానీ అనే ఇద్దరు విద్యార్థులు ఈ పరికరాన్ని రూపొందించారు. ప్రొఫెసర్ వెంకటేశ్వరన్ నేతృత్వంలో దీనిని తయారు చేశారు." దగ్గు ఉన్న వ్యక్తిని ఇది గుర్తిస్తుంది. ఈ పరికరాన్ని మొదటి స్ధాయి స్క్రీనింగ్ లోనే కొంత మేర అంచనా వేయవచ్చని" ప్రొఫెసర్.వెంకటేశ్వరన్ చెబుతున్నారు. "ఒకే సమయంలో ఎక్కువమంది రోగులను ఇది కనిపెడుతుందని, తద్వారా తక్కువ సమయంలో ఎక్కువ మందిని గుర్తించి జాగ్రత్త పడడానికి అవకాశం ఉంటుందని" ఆయన అంటున్నారు.ఈ పరికరం తో భవిష్యత్ లో మరిన్ని ప్రయోజనాలు న్నాయని కోల్ కతా నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కోలేరియా అండ్ ఎంటరిక్ డీసీజెస్ (ఐసిఎం ఆర్) తోపాటు పలువురు వైద్యులు పేర్కొన్నారు. క్లినికల్ టెస్టింగ్ అనంతరం దీనిని మార్కెట్లోకి ప్రవేశ పెట్టనున్నారు. 

పాత్‌ట్రాకర్‌ సాధనం: కరోనా మహమ్మారి ఆనవాళ్లను కనిపెట్టేందుకు పరిశోధకులు పాత్‌ట్రాకర్‌ అనే సరికొత్త సాధనాన్ని సృష్టించారు అమెరికాకు చెందిన సైంటిస్టు లు. స్మార్ట్‌ఫోన్‌ సాయంతో పనిచేసేలా దీనిని రూపొందించారు. వ్యాధికారక వైరస్‌లు, బ్యాక్టీరియాలను ఈ పరికరంతో 30 నిమిషాల్లో కనిపెట్టేయొచ్చు. అమెరికాలోని ఇల్లినాయిస్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ బ్రియాన్‌ కన్నింగ్‌హాం నేతృత్వంలోని బృందం దీనిని రూపొందించింది. పరీక్ష కారకాల క్యాట్రిడ్జ్‌తో కూడిన పాత్‌ట్రాకర్‌ లోపల ఓ చిన్నపోర్టు ఉంటుంది. అనుమానిత వ్యక్తి నుంచి సేకరించిన స్వాబ్‌ కానీ రక్త నమూనాను కానీ ఆ పోర్టులో ఉంచుతారు. క్యాట్రిడ్జ్‌ లోపల ఉండే కారకాలు... వైరస్‌ల పైభాగాన్ని పగులగొట్టి ఆర్‌ఎన్‌ఏను సేకరిస్తాయి. అందులో ప్రాథమికంగా లభించే అణువు 15 నిమిషాల్లో లక్షల సంఖ్యలో జన్యు పదార్థాలుగా మారిపోతుంది. ఫ్లోరోసెంట్‌ రంగు మరకల్లా ఉండే ఆ జన్యు పదార్థాలపై నీలిరంగు లెడ్‌ వెలుతురు పడితే అవి ఆకుపచ్చ రంగులోకి మారతాయి.  వీటిని స్మార్ట్‌ఫోన్‌లోని కెమెరా ద్వారా గుర్తించవచ్చు. పాత్‌ట్రాకర్‌పై ఉండే క్లిప్‌తో దానిని స్మార్ట్‌ఫోన్‌తో అనుసంధానించుకోవచ్చు.విమానాలు ఎక్కబోయే ముందు ప్రయాణికులకు, వివిధ కార్యక్రమాల ప్రారంభానికి ముందు ఆహ్వానితులకు ఈ పాత్‌ట్రాకర్‌ ద్వారా త్వరితగతిన పరీక్షలు చేయవచ్చునని కన్నింగ్‌హాం చెబుతున్నారు.

విరియాన్‌ పరికరం : వైరస్‌ల ఉనికిని వేగంగా గుర్తించడం ద్వారా ఆరోగ్య సంరక్షణలో దోహదపడగల సరికొత్త పరికరాన్ని అమెరికా శాస్త్రవేత్తలు తాజాగా అభివృద్ధి చేశారు. ‘విరియాన్‌’గా పిలిచే ఈ చిన్న పరికరం చేతితో పట్టుకునేందుకు వీలుగా ఉంటుంది. అందులోని నానోట్యూబులు పరిమాణం ఆధారంగా వైరస్‌ల ఉనికిని కనిపెడతాయి. అనంతరం రామన్‌ వర్ణపట మాపనాన్ని (స్పెక్ట్రోస్కోపీ) ఉపయోగిస్తూ వ్యక్తిగత కంపనాలను బట్టి వైరస్‌ రకాలను గుర్తించవచ్చు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న విధానాల్లో వైరస్‌ల గుర్తింపునకు రోజుల తరబడి సమయం అవసరమవుతున్నదని శాస్త్రవేత్తలు తెలిపారు. విరియాన్‌తో ఈ పనిని కేవలం నిమిషాల వ్యవధిలో, తక్కువ ఖర్చుతో పూర్తి చేయొచ్చని పేర్కొన్నారు. వైరస్‌లు తక్కువ సంఖ్యలో ఉన్నప్పటికీ వాటి జాడను అది గుర్తించగలదని చెప్పారు. పరిమాణం తక్కువగా ఉండటంతో మారుమూల ప్రాంతాలకూ విరియాన్‌ను తీసుకెళ్లడం వీలవుతుందని వెల్లడించారు.


logo